‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’ లాంటి సరికొత్త కథాంశాల నేపథ్యంలో నడిచే సినిమాలతో కొత్త పంథాకు నిర్దేశం చేసిన దర్శకుడు క్రిష్. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా, క్రిష్ హిందీలో దర్శకత్వం వహించిన సినిమా ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ విశేషంగా అలరిస్తోంది. గతంలో తమిళంలో నిర్మించబడి సూపర్ హిట్‌గా నిలిచిన మురుగదాస్ సినిమా ‘రమణ’కి రీమేకే ఈ గబ్బర్. ఇక ‘రమణ’ సినిమా, తెలుగులో ‘ఠాగూర్’ పేరుతో చిరంజీవి హీరోగా రీమేక్ అయి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఠాగూర్ హిందీ రీమేక్‌కు చాలా పేర్లు తెరపైకి వచ్చినా, చివరకు దర్శకుడు క్రిష్‌ను అవకాశం వరించింది. ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ సినిమాలో అక్షయ్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. క్రిష్ తన మార్క్‌ని నిలబెట్టుకుంటూనే ఎక్కడా మాతృక సినిమాకు దూరంగా ఈ సినిమాని నడిపించలేదన్నది ట్రైలర్ ద్వారానే తెలుస్తోంది. క్రిష్ మేకింగ్ స్టైల్‌కి బాలీవుడ్ విశ్లేషకుల నుండి మంచి స్పందన వస్తోంది.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కి సంబంధించి ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి. డొమెస్టిక్ మార్కెట్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఓ సంస్థ 60 కోట్లు వెచ్చించి డిస్ట్రిబ్యూషన్ హక్కులు పొందిందని సమాచారం. శృతి హాసన్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.


