‘మిఠాయి’ బాగా నవ్విస్తుంది – ప్రియదర్శి !

‘మిఠాయి’ బాగా నవ్విస్తుంది – ప్రియదర్శి !

Published on Feb 16, 2019 8:00 AM IST

ప్రముఖ కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా నటించిన డార్క్ కామెడీ సినిమా ‘మిఠాయి’. నూతన దర్శకుడు ప్రశాంత్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఫిబ్రవరి 22న సినిమా విడుదలవుతోంది. ఇక ఈ చిత్రం యొక్క ఆడియో ని శుక్రవారం రాత్రి విడుదల చేశారు. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని ‘హుషారు’ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి స్వీకరించారు.

అనంతరం తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ “అందరూ అనుకున్నట్టు నేనింకా యాక్టర్ అవ్వలేదు. డైరెక్షన్ చేస్తున్నా. కాకపోతే… అనుకోకుండా రోల్స్ రావడంతో చేస్తున్నా. యాక్టింగ్ చాలా కష్టమనేది కూడా అర్థమైంది. ‘మిఠాయి’ విషయానికి వస్తే… ఈ సినిమా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నా స్నేహితులు. మేమంతా కలిసి ఆడుతూ పాడుతూ ‘సైన్మా’, ‘పెళ్లి చూపులు’ చేశాం. మమ్మల్ని ప్రేక్షకులు ఇంత ఆదరిస్తారని, ఇంత సక్సెస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. మాకు నచ్చినది చేశాం. వర్కౌట్ అయింది. మిఠాయి చూస్తున్నప్పుడు ఈ టీమ్ అంతా నచ్చిన పనిని ఎంజాయ్ చేస్తూ చేశారని ఫీలింగ్ కలిగింది. ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నానని అన్నారు.

దర్శకుడు శ్రీ హర్ష కొనగంటి మాట్లాడుతూ “నా ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ హీరోగా నటించిన చిత్రమిది. మేం ‘హుషారు’ షూటింగ్ చేసేటప్పుడు ఈ సినిమా గురించి రాహుల్ రామకృష్ణ చాలా మంచి మంచి విషయాలు చెప్పేవారు. ప్రేక్షకులు అందరిలా నేను కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తున్నా. డార్క్ హ్యూమర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం” అన్నారు.

సినిమా దర్శకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ “నా కథపై నమ్మకంతో సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సినిమా ప్రొడ్యూస్ చేసిన నా బ్రదర్ ప్రభాత్ కుమార్ కి థాంక్స్. నా అకౌంటులో జీరో బాలన్స్ ఉన్నా… షూటింగ్ స్టార్ట్ చేసేవాణ్ణి. హండ్రెడ్ పర్సెంట్ ప్రభాత్ ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేస్తాడని నమ్మకం. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, షఫీ… అందరూ ఎంతో హెల్ప్ చేశారు” అన్నారు.

సినిమా నిర్మాత ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ “నేను ఓ డాక్టర్. నన్ను నిర్మాతను చేసింది ప్రశాంతే. తను ఏడాదిన్నర పాటు సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు” అన్నారు.

ప్రియదర్శి మాట్లాడుతూ “ప్రశాంత్ కుమార్ ఈ కథ ఇచ్చి చదవమన్నాడు. సరేనని చదివా. ఇదేదో కొంచెం డార్క్ ఉందని అనుకున్నా. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా భయాలు ఉండేవి. రాహుల్ రామకృష్ణ సినిమాలోకి వచ్చాక.. అంతా సెట్ అయ్యింది. ఈ నెల 22న థియేటర్లకు రండి. మీరూ ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి… నవ్విస్తాం” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు