ఆకాష్ సినిమాకు కితాబిచ్చిన పూరీ జగన్నాథ్!

Puri-akash
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాష్ ‘ఆంధ్రాపోరి’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే! ప్రతిష్టాత్మక ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేష్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఋషి సినిమా ఫేం రాజ్ మాదిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇన్నోసెంట్ టీనేజ్ ప్రేమకథకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా పూరీ ఆకాష్ యాక్టింగ్‍కు అంతటా మంచి రెస్పాన్స్ వస్తోంది.

తన కుమారుడు హీరోగా నటించిన సినిమా మంచి ఆదరణకు నోచుకుంటున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పూరీ జగన్నాథ్ ఆంధ్రాపోరి గురించి మాట్లాడారు. “కొంచెం బిజీగా ఉండి నిన్న రాత్రే సినిమా చూశాను. మంచి టీనేజ్ లవ్‌స్టోరీ. దర్శకుడు రాజ్ మాదిరాజు మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఆకాష్ గురించి చెప్పాలంటే నేనైతే వాడింత బాగా చేయగలడని అనుకోలేదు. క్లైమాక్స్ సీన్లో చాలా బాగా చేశాడు. ఇప్పటికిప్పుడు వాడితో ఓ సినిమా చేసేయాలనిపిస్తుంది” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు పూరీ. ఉల్కా గుప్తా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు డా. జోశ్యభట్ల శర్మ సంగీతం సమకూర్చారు.

Exit mobile version