సేవా దృక్పథం అనేది ఆయన రక్తంలోనే ఉంది – పూరీ జగన్నాథ్

సేవా దృక్పథం అనేది ఆయన రక్తంలోనే ఉంది – పూరీ జగన్నాథ్

Published on Oct 21, 2018 12:05 PM IST


అపదలో ఉన్న ఎందరినో ఆదుకుంటూ ఆపన్నులను అక్కున చేర్చుకుంటున్న సామాజిక సేవా సంస్థ ”మనం సైతం”. ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న ‘మనం సైతం’ రోజురోజుకు పేదవాడికి జీవనాడిగా నిలుస్తోంది. లక్షలాది సైన్యంగా ఎదుగుతోంది. వందల మంది పేదలు ఆదుకోవాలంటూ ఈ సేవా సంస్థను ఆశ్రయిస్తున్నారు. మనం సైతం దగ్గరకు వచ్చే ఆర్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా మరికొందరు పేదలకు మనం సైతం ఆర్థిక సహాయాన్ని అందించింది.

హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి జయలలిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణికంఠ, పి. రంగాచార్యులు, లక్కీ యాదవ్, గుమ్మోజి భరత్ కుమార్, అంజనాదేవి, టీఎన్వీ గాయత్రి, ఝాన్సీ, భాస్కర్, దిలీప్ తేజ లకు చెక్ లను అతిథుల చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న నటి జయలలిత లక్ష రూపాయలు, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున ప్రెసిడెంట్ స్వామి గౌడ్, అనిల్, రవి లక్ష రూపాయలు, నిర్మాత బన్నీవాస్ 75 వేల రూపాయలు, కౌశల్ 25 వేల రూపాయల విరాళం ప్రకటించగా…దర్శకుడు పూరీ జగన్నాథ్ మనం సైతంకు ఒక ప్రత్యేకమైన యాప్ తయారు చేసి ఇస్తానని చెప్పారు.

ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ….కాదంబరి కిరణ్ అన్నయ్యతో నాకున్న స్నేహం వయసు 30 ఏళ్లు. నేను సహాయ దర్శకుడిగా పని దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో ఏదో ఒక పని చెప్పి వెయ్యి, రెండు వేలు చేతిలో పెడుతుండేవారు. సేవా దృక్పథం అనేది కాదంబరి అన్న రక్తంలోనే ఉంది. ఇక్కడికొచ్చాకే ఆయన ఎంత పెద్ద సేవా కార్యక్రమం చేస్తున్నాడో అర్థమయ్యింది. దేవుడు మనకు సాయం చేసినా చేయకున్నా మనకు అండగా ఉండేది సాటి మనిషే అని నేను నమ్ముతాను. అలాంటి సాయం చేసే మనిషి కాదంబరి. మనందరం కలిసి ఈ సేవా సంస్థను మరింత అభివృద్ధి చేయాలి. ఇందుకు ఒక యాప్ రూపొందించాలి అనుకుంటున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు