‘పురుష:’ డైరెక్టర్ వీరు వులవల – నా 26 ఏళ్ల కల నెరవేరింది.. సినిమా చూసి మా నిర్మాత కన్నీళ్లు పెట్టుకున్నారు

‘పురుష:’ డైరెక్టర్ వీరు వులవల – నా 26 ఏళ్ల కల నెరవేరింది.. సినిమా చూసి మా నిర్మాత కన్నీళ్లు పెట్టుకున్నారు

Published on May 16, 2026 10:00 AM IST

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన తాజా చిత్రం ‘పురుష:’. పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా మే 22న థియేటర్లలో సందడి చేయబోతోంది. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ మూవీ పోస్టర్లు, గ్లింప్స్ ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విశేషాలను దర్శకుడు వీరు వులవల మీడియాతో పంచుకున్నారు.

చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఉన్న ఆసక్తితో పెయింటింగ్స్ వేసే వీరు వులవల.. ‘కొత్త బంగారు లోకం’ నుంచి మొదలుపెట్టి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సినిమాలకు దాదాపు 350కి పైగా టైటిల్స్ డిజైన్ చేశారు. ‘మళ్లీరావా’, ‘జెర్సీ’, ‘మసూద’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. జెర్సీ సినిమా టైమ్‌లోనే ‘పురుష:’ కథకు బీజం పడిందని ఆయన చెప్పుకొచ్చారు. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా వస్తున్న ప్రస్తుత ట్రెండ్‌లో.. భార్యాభర్తల కాన్సెప్ట్‌తో మేల్ ఓరియెంటెడ్ పాయింట్‌తో ఈ కథను సిద్ధం చేశారట. ఈ స్క్రిప్ట్ వినగానే నిర్మాత కోటేశ్వరరావుకు బాగా నచ్చడంతో వెంటనే ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.

నవ్వులు పూయించే కిటికీ ఎపిసోడ్

ప్రేమ కోసం ఏమైనా చేసే యువకుడిగా పవన్ కళ్యాణ్ నటన అందరినీ ఆకట్టుకుంటుందని డైరెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఆర్టిస్ట్ కావడంతో పవన్ కళ్యాణ్ ముందుగా సత్యానంద్ గారి వద్ద శిక్షణ తీసుకున్నారు. ఏకంగా రెండు నెలల పాటు వర్క్ షాప్ నిర్వహించిన తర్వాతే 51 రోజుల పాటు కాకినాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో వెన్నెల కిషోర్ తో వచ్చే ఒక ‘కిటికీ ఎపిసోడ్’ ప్రేక్షకులను థియేటర్లలో పగలబడి నవ్వేలా చేస్తుందని వీరు వులవల తెలిపారు. దీనికి తోడు సప్తగిరి, కసిరెడ్డి కామెడీ టైమింగ్, డైలాగ్స్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ.

26 ఏళ్ల కల.. కన్నీరు పెట్టుకున్న నిర్మాత

ఈ సినిమా ప్రయాణంలో నిర్మాత కోటేశ్వరరావు ఇచ్చిన సపోర్ట్ ఎనలేనిదని దర్శకుడు గుర్తుచేసుకున్నారు. షూటింగ్ ఏ దశలోనూ ఆయన ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ప్రోత్సహించారు. ఫైనల్ కాపీ చూసిన తర్వాత కోటేశ్వరరావు ఎమోషనల్ అయ్యారని, తన 26 ఏళ్ల కల నెరవేరిందని కన్నీరు పెట్టుకున్నారని వీరు వులవల తెలిపారు. భార్యాభర్తల ఎమోషన్స్, అవుట్ అండ్ అవుట్ కామెడీతో పాటు అవసరమైన చోట హారర్, థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయని.. కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసేలా ‘పురుష:’ సిద్ధమైందని ఆయన స్పష్టం చేశారు. సతీష్ కెమెరా వర్క్, శ్రవణ్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని దర్శకుడు ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు