
సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే భారీ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది పీవీపీ సినిమా. ఇప్పటికే ‘విశ్వరూపం’, ‘బలుపు’, ‘వర్ణ’ లాంటి సినిమాలతో మంచి సినిమాలను నిర్మించిన ఈ సంస్థ తాజాగా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఓ వైపు భారీ బడ్జెట్ పెద్ద సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్న సినిమాలను నిర్మించే పనిలో పడింది.
ప్రస్తుతం నాగార్జున-కార్తీ కాంబినేషన్‌లో ఓ సినిమా, అనుష్క ‘సైజ్‌జీరో’, ‘బెంగళూర్ డేస్’ తమిళ రీమేక్ తదితర సినిమాల షూటింగ్ ఇప్పటికే మొదలుకాగా, తాజాగా మరో సినిమా షూటింగ్ మొదలైంది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ‘క్షణం’ అనే సినిమా షూటింగ్ అమెరికాలో నేడు మొదలైంది. అదాశర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు రవికాంత్ పేరేపు తెరకెక్కిస్తున్నారు. టీవీ యాంకర్ అనసూయ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తోంది.

