
‘తని ఒరువన్’.. జయం రవి హీరోగా, 90వ దశకంలో తెలుగు, తమిళ సినిమాల్లో సంచలనంగా నిలిచిన అరవింద్ స్వామి విలన్‌గా రూపొందిన సినిమా. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలామంది నిర్మాతలే పోటీ పడగా ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ హక్కులను సొంతం చేసుకున్నారు. భారీ మొత్తం చెల్లించి ఆయన సొంతం చేసుకున్న ఈ సినిమా రీమేక్‌లో రామ్ చరణ్ హీరోగా నటించనున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్‌తో బ్రూస్లీ సినిమా చేస్తోన్న దానయ్య, ఆ తర్వాత వెంటనే తని ఒరువన్ రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో ప్రముఖ నటుడు మాధవన్ విలన్‌గా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. తమిళ, హిందీ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మాధవన్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాధవన్‌ను తెలుగు రీమేక్‌కు సంప్రదించినట్లు తెలుస్తోంది. తమిళంలో అరవింద్ స్వామి చేసిన పాత్రకు తెలుగులో మాధవన్‌ను సంప్రదిస్తున్నారు.

