గోదావరి జిల్లాల నుంచి వచ్చిన చాలా మంది నటీనటుల్లో సునీల్ కూడా ఒకరు. కమెడియన్ గా ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఆ తర్వాత కామెడీ హీరోగా, అటుపై యాక్షన్ హీరోగా మారిన నటుడు సునీల్. ఇదే కోవలోనే గోదావరి జిల్లాల నుంచి రీసెంట్ గా తెలుగు తెరకు పరిచయమైన హీరో రాజ్ తరుణ్. డైరెక్టర్ కావాలనుకొని వచ్చి హీరోగా మారిన రాజ్ తరుణ్ మొదటి రెండు సినిమాలతోనే హిట్స్ అందుకొని మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. రాజ్ తరుణ్ నటించిన మూడవ సినిమా ‘కుమారి 21F’ ఈ వారం అనగా నవంబర్ 20న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు డైరెక్టర్ అవ్వాలని వచ్చారు.. మరి హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారా అని అడిగితే ‘ఇటీవలే సునీల్ భయ్యాని కలిసాను. ఆయన నా కోసం ఏమన్నా కథ సిద్దం చేయచ్చుగా అన్నారు, ఆయన అడిగారని ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఓ కథ రాసాను.. త్వరలోనే ఆయనకి చెప్పాలని’ రాజ్ తరుణ్ సమాధానం ఇచ్చాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఇద్దరు హీరోలు కలిసి వచ్చే ఏడాది ఓ సినిమాని పట్టాలెక్కిస్తారు. కుమారి 21F తర్వాత రాజ్ తరుణ్ వంశీ మరియు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు.


