యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘టార్టాయిస్’ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్.కె. గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్, ఎన్.వి.ఎల్. క్రియేషన్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో “పగలు రాత్రి కలవకూడదు అన్నది దైవ నిర్ణయం అయితే, కత్తి తో చావును కలపాలన్నది మానవ నిర్ణయం. రాత్రి జరిగే హత్యలకి సాక్ష్యం ఈ చంద్రుడు…” వంటి ఆసక్తికరమైన సంభాషణ ఉంది.
ఈ చిత్రానికి రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్‌కు జోడీగా అమృత చౌదరి నటిస్తుండగా, శ్రీనివాస్ అవసరాల మరియు ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ, ‘టార్టాయిస్’ కథ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉందని, ఈ చిత్రం తన కెరీర్‌కు మంచి కిక్ ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ, ఇది కొత్త స్క్రీన్‌ప్లేతో కూడిన మంచి థ్రిల్లర్ అని, రాజ్ తరుణ్ కెరీర్‌లో ఇది బెస్ట్ సినిమా అవుతుందని చెప్పారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.


