చిట్ చాట్ : రక్షక భటుడు నిర్మాత ఏ. గురురాజ్ – ఇది కుటుంబమంతా కలిసి చూడదగిన సినిమా !
Published on Apr 10, 2017 1:47 pm IST


‘రక్ష, జక్కన్న’ చిత్రాల వంశీకృష్ణ ఆకెళ్ళ ప్రస్తుతం ‘రక్షక భటుడు’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సుఖీభవ మూవీస్ సంస్థ పై ఏ. గురురాజ్ నిర్మిస్తున్నారు. ఈరోజు తన పుట్టినరోజు ఈ సందర్బంగా ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) సినిమా ఎప్పుడు రిలీజవుతుంది ?
జ) సాధారణంగా ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలనుకున్నాము. కానీ సెన్సార్ కార్యక్రమం కాస్త ఆలస్యమవడం, క్లైమాక్స్ లో ఆంజనేయస్వామి పాత్ర తాలూకు గ్రాఫికల్ వర్క్ ఇంకా పూర్తి కాకాపోవడంతో రిలీజ్ ఆలస్యమవుతోంది.

ప్ర) మరి కొత్త రిలీజ్ డేట్ ఏంటి ?
జ) మే నెల 5వ తారీఖున రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము. అప్పటికి గ్రాఫికల్ వర్క్, సెన్సార్ వర్క్ అన్నీ పూర్తైపోతాయి కనుక మంచి సినిమాను ప్రేక్షకులకు అందివ్వొచ్చు.

ప్ర) ఈ చిత్రం ఎలా ఉండబోతోంది ?
జ) ప్రస్తుతం చాలా సినిమాలన్నీ కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేదు. అసలు ఏది కామెడీయో, ఏది చూడదగినదో తెలీడం లేదు. అందుకే ఈ సినిమాని కుటుంబం మొత్తం చూడదగిన సినిమాగా రూపొందిస్తున్నాం. మా సుఖీభవ సంస్థ నిర్మించే సినిమాలన్నీ ఇలానే కుటుంబ సమేతంగా చూడదగిన విధంగా ఉంటుంది. ఈ సినిమాలో చాలా వరుకు కామెడీ ఉంటుంది. క్లైమాక్స్ కూడా మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమాకి కథే బలం.

ప్ర) ఈ సినిమా కథలో మీకు బాగా నచ్చింది ఏంటి ?
జ) చాలా సినిమాల్లో సరైన కథ ఉండదు. ప్రేమ ఉంటే కామెడీ ఉండదు. కానీ ఈసినిమాలో అన్నీ ఉంటాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమాలని నిర్మించాలనే నేను మా సుఖీభవ సంస్థపై నిర్మించాం.

ప్ర) ఈ సినిమాలో ఆంజనేయుడి పాత్ర చేసింది ఎవరు ?
జ) ఇందులో ఆంజనేయుడి పాత్ర చాలా ముఖ్యమైనది. అందులో మనకు బాగా తెలిసిన ఒక స్టార్ నటుడు నటించారు. అలాగే ఇంకొక కీలకమైన పాత్ర కూడా ఉంది. అందులోనూ స్టార్ హీరో నటించారు. ఆ రెండింటినీ ఇప్పుడే రివీల్ చేయం. సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఎంత సీక్రెటో ఇది కూడా మా సినిమాకు అంతే సీక్రెట్.

ప్ర) ఇంకా ఇందులో ఎవరెవరు నటించారు ?
జ) ఇందులో చాలా మంది తెలిసిన నటీనటులున్నారు. అరకు లోయలోని ఒక పోలీస్ స్టేషన్ లో జరిగే కథ. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, బాహుబలి ప్రభాకర్, సుప్రీత్ వంటి స్టార్ నటులు నటించారు. ఇందులో అన్ని రకాల అంశాలు ఉంటాయి.

ప్ర) మీరు కూడా ఇందులో నటించారు కదా. మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఒక చిన్న పాత్ర చేశాను. మొదట్లో నేను కూడా నటుడిని అవుదామనే ఇక్కడకొచ్చాను. కానీ దురదృష్టవశాత్తు కాలేకపోయాను. ఆ తర్వాత మార్కెటింగ్ రంగంలోకి దిగి ఈ సంస్థను స్థాపించాను. స్వచ్ఛంద సంస్థలకు కూడా సహాయం అందిస్తాను. కానీ కళామతల్లి మీదున్న ప్రేమ పోలేదు కనుక నిర్మాతగా సినిమాలు చేస్తున్నాను. ఆ పఇష్టంతోనే ఇందులో ఒక చిన్న పాత్ర చేశాను.

ప్ర) సినిమా బిజినెస్ ఎలా జరుగుతోంది ?
జ) చాలా మంది బయ్యర్స్ సినిమాను అడుగుతున్నారు. కానీ ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు. గ్రాఫికల్ వర్క్, సెన్సార్ అయ్యాక బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం.

 
Like us on Facebook