టాలీవుడ్‌లోకి ‘చిరుత’ ప్రవేశించి సరిగ్గా 13 ఏళ్లు

Published on Sep 28, 2020 9:08 pm IST


తెలుగు పరిశ్రమలోని యువ స్టార్ హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇకరు. ఈ స్థాయికి రావడానికి చరణ్ చాలానే కష్టపడ్డారు. సరిగ్గా 13 సంవత్సరాల క్రితం అంటే 2007లో ఇదే రోజైన సెప్టెంబర్ 28వ తేదీన ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు చరణ్. ఈ చిత్రాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయగా ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. మెగాస్టార్ చిరు వారసుడు అంటే కోట్లాది మంది అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్సులు, ఫైట్స్, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ ఇలా అన్ని విషయాల్లోనూ చిరంజీవి స్థాయికి తగ్గట్టు ఉండాలని బెంచ్ మార్క్ పెట్టేశారు అభిమానులు.

ఈ హైప్ అంతా అప్పుడే ఎంట్రీ ఇస్తున్న చరణ్ భుజాల మీద కొడంత బరువులా పడింది. అయినా చరణ్ దాన్ని మోయగలిగాడు. ‘చిరుత’ విడుదలైన మొదటిరోజే చరణ్ స్టామినా ఏమిటో బాక్స్ఆఫీస్ ముందు నిరూపితమైంది. రికార్డ్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. చరణ్ పెర్ఫార్మెన్స్ చూసి చిరుకు సరైన వారసుడు వచ్చాడని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక రెండో చిత్రం ‘మగధీర’తో అప్పటివరకు ఏ స్టార్ హీరోకూ లేని భారీ వసూళ్ల రికార్డులను క్రియేట్ చేసి స్టార్ హీరోగా నిలబడిపోయారు. ఆ తర్వాత చేసిన ‘ఆరెంజ్’ పరాయం చెందినా ‘రచ్చ, నాయక్’ సినిమాలతో మళ్లీ ట్రాక్ ఎక్కాడు.

ఇక కెరీర్ మధ్యలో ‘తుఫాన్, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ, వినయ విధేయరామ’ లాంటి చిత్రాలు నిరుత్సాహపరిచినా ఎక్కడా కుంగిపోకుండా లేచి నిలబడ్డాడు. ‘ఎవడు, ధృవ’ లాంటి సినిమాలతో తనని తాను ప్రూవ్ చేసుకుంటూనే 2018లో మళ్లీ ‘రంగస్థలం’ చిత్రంతో బాక్స్ఆఫీస్ షేక్ అయ్యే భారీ హిట్ కొట్టి నెంబర్ వన్ రేసులో ముందంజలో నిలబడ్డారు. ఇలా సుధీర్ఘమైన 13 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను, ఎత్తు పల్లాలను చూసిన చరణ్ నటుడిగా, స్టార్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. ఎంట్రీ తన తండ్రి చిరంజీవి పేరు మీదే ఇచ్చుకున్నా కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అన్నిటికంటే ముఖ్యంగా తన క్రమశిక్షణతో తండ్రి చిరంజీవికి మరింత గౌరవాన్ని తెచ్చారు. ప్రజెంట్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో, చిరు-కొరటాల శివల ‘ఆచార్య’లో నటిస్తున్నారు చరణ్.

సంబంధిత సమాచారం :

More