హీరోలకి, అభిమానులకి మధ్య కేవలం వ్యాపారపరమైన సంబంధాలు కాకుండా ఆత్మీయ సంబందాలు ఉన్నప్పుడే వారి ప్రయాణం విజయవంతంగా సాగుతుంది. ఈ విషయం మెగా ఫ్యామిలీ హీరోలకు చాలా బాగా తెలుసు. అందుకే చిరంజీవి దగ్గర్నుంచి ఆ ఫ్యామిలీ నుండి నిన్న మొన్న వచ్చిన హీరోల వరకూ అందరూ అభిమానులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ హాస్పిటల్లో ఉన్న మెగా అభిమాని ఒకర్ని ఆప్యాయంగా పలకరించారు.
వివరాల్లోకి వెళితే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సిటీ ప్రెసిడెంట్ నూర్ మహమ్మద్ ఆరోగ్యం బాగోలేక సికింద్రాబాద్ లోని విజయ హెల్త్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ విషయం తెలుసుకున్న చరణ్ ధృవ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఈరోజు ఉదయం 8:45 గంటలకు హాస్పిటల్ కు వెళ్లి నూర్ ఆరోగ్య పరిస్థితిని విచారించి మెడికల్ ఖర్చులన్నీ తానే చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా అక్కడున్న అభిమానులు తమఫై మెగా ఫ్యామిలీ చూపుతున్న శ్రద్ధ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.


