సమీక్ష : రణరంగం – స్లోగా సాగే గ్యాంగ్ స్టర్ జర్నీ !

Published on Aug 16, 2019 3:02 am IST
Ranarangam movie review

విడుదల తేదీ : ఆగస్టు 15, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌

దర్శకత్వం : సుధీర్ వర్మ

నిర్మాత‌లు : సూర్యదేవర నాగవంశీ

సంగీతం : ప్రశాంత్ పిళ్ళై

సినిమాటోగ్రఫర్ : దివాకర్ మణి

ఎడిటర్ : నవీన్ నూలి

శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ లు హీరోయిన్స్ గా వచ్చిన సినిమా ‘రణరంగం’. కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

దేవ (శర్వానంద్) తన ఫ్రెండ్స్ తో కలిసి వైజాగ్ లోని ఓ కాలనీలో ఉంటూ.. సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ ఉంటారు. ఈ క్రమంలో గీత (కల్యాణి ప్రియదర్శన్)ని చూసిన తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు దేవ. ఆ తరువాత ఇద్దరి మధ్య పరిచయం ఎలా అయింది.. ఆ పరిచయం కాస్త ప్రేమ నుండి పెళ్లి వరకూ ఎలా దారి తీసింది..? ఈ మధ్యలో దేవ ఎలాంటి బిజినెస్ లు చేసి.. ఎలా ఎదిగాడు..? అలాగే ప్రస్తుతం అతని జీవితంలోకి గీత (కాజల్ అగర్వాల్ ) ఎలా వచ్చింది ? చివరికి దేవని చంపటానికి ప్రయత్నం చేస్తోన్న వాళ్లు ఎవరు ? ఇంతకీ ఓ సామాన్య కుర్రాడు ఒక గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు ? లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ సినిమాను వెండితెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమా 1990 కాలంలో మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారంగా సాగుతూ.. సినిమాలో అక్కడక్కడ వచ్చే కొన్ని భావోద్వేగాలు మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. అలాగే శర్వానంద్ యాక్టింగ్ మరియు శర్వా క్యారెక్టర్ లోని షేడ్స్, శర్వానంద్ – కల్యాణి ప్రియదర్శన్ మధ్య కెమిస్ట్రీ మరియు సాంగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో ఆవేశంగా ఉండే దేవ పాత్ర‌కు శర్వానంద్ ప్రాణం పోసాడు. ఓల్డ్ ఏజ్ పాత్రలో కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేస్తూ సినిమాలోనే శర్వానంద్ హైలెట్ గా నిలిచాడు.

ఇక కథానాయకలుగా నటించిన కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ లు తమ పాత్రల్లో చాలా చక్కగా నటించారు. ముఖ్యంగా కల్యాణి ప్రియదర్శన్‌ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ కల్యాణి ప్రియదర్శన్‌ పలికించిన హావభావాలు చాలా బాగున్నాయి. ఇక కాజల్ పాత్ర గెస్ట్ రోల్ లాగే అనిపిస్తోంది.

హీరోకి ఫ్రెండ్స్ గా నటించిన నటులు అందరూ హీరోకి హెల్ప్ చేసే సపోర్టింగ్ రోల్స్ లో చాల బాగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు సుధీర్ వర్మ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు ఇంటర్వెల్ లాంటి యాక్షన్ సీక్వెన్స్ స్ బాగున్నా.. స్క్రీన్ ప్లే సాగతీసినట్లు చాల స్లోగా సాగుతుంది. దానికి తోడు కొన్ని మెయిన్ సన్నివేశాలు కూడా బోర్ కొడతాయి. పైగా సీరియ‌స్ గా ఎమోషనల్ గా సాగే క‌థ కావడంతో బిసి ప్రేక్షకుల ఆశించే ఎలిమెంట్స్, ట్విస్టులు, సర్‌ ప్రైజ్‌లుపెద్దగా లేవు. ఉన్నవి కూడా ఆకట్టుకునేలా అనిపించవు.

పైగా సినిమాలో హీరో చుట్టూ సాగే డ్రామా మరియు బలహీనమైన సంఘర్షణకి లోబడి బలహీనంగా సాగడం కూడా బాగాలేదు. అయితే దర్శకుడు హీరో జర్నీని బలంగా ఎలివేట్ చేసినప్పటికీ.. హీరోకి ఎదురయ్యే సమస్యలను కానీ.. హీరో పాత్రకి వచ్చే సంఘర్షణ గానీ ఆ స్థాయిలో లేవు. దీనికి తోడు సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి.అయితే దర్శకుడు సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. మెయిన్ గా సెకండ్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొడుతోంది. ఎడిటర్ అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. ప్రశాంత్ పిళ్ళై పాటలు బాగున్నాయి. అలాగే ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు సరైన కథాకథనాలను రాసుకోలేకపోయారు.

 

తీర్పు :

 

శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నా..,కథాకథనాలు స్లోగా సాగుతూ సినిమా ఆసక్తికరంగా సాగలేదు.దర్శకుడు మంచి పాయింట్ తీసుకున్నా.. ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సినిమాని మలచలేకపోయాడు.అయితే సినిమాలో శర్వానంద్ యాక్టింగ్ మరియు శర్వానంద్ – కల్యాణి ప్రియదర్శన్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. మొత్తం మీద ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :