గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ అయిన రుద్రమదేవి సినిమా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని అక్టోబర్ 9న తెలుగు, హిందీ, మళయాలం భాషల్లో భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. కాకతీయ సామ్రాజ్య వీరనారి రాణీ రుద్రమదేవి కథ కావడం, భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ సినిమా కావడం అనుష్క, అల్లు అర్జున్, రానా లాంటి భారీ తారాగణం నటించడం వంటి కారణాలతో సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాపై ఇతర భాషల్లో కూడా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగుతో పాటు హిందీ, మళయాలంలోనూ సినిమాను విడుదల చేశారు. తమిళంలో అక్టోబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది.
ఇక విడుదల నాటినుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లనే కొల్లగొడుతోంది. తెలుగులో ఇప్పటికే ఫస్ట్ వీకెండ్ 31కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా, వీక్ డేస్‌లోనూ మంచి ప్రతిభ కనబరుస్తోంది. ఇక రుద్రమదేవి హిందీ వర్షన్‌కు కూడా మంచి రెస్పాన్సే రావడం విశేషంగా కనిపిస్తోంది. ఐశ్వర్యరాయ్ నటించిన ‘జజ్బా’ సినిమాతో పాటు గత శుక్రవారం విడుదలైన రుద్రమదేవి ఫస్ట్ వీకెండ్ 2.07కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీలో ఏమాత్రం అంచనాలు లేకుండా, పెద్దగా ప్రచారమేమీ లేకపోయినా ఫస్ట్ వీకెండ్ రుద్రమదేవి కలెక్షన్స్ ఆశాజనకంగానే ఉన్నాయి. అభిషేక్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా రుద్రమదేవిని హిందీలో విడుదల చేశాయి. రానున్న దసరా వీకెండ్‌కు కూడా రుద్రమదేవి హిందీలో మంచి కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


