
గుణశేఖర్ ఎన్నో ఏళ్ళ పాటు పరిశోధించి, దాదాపుగా మూడేళ్ళ పాటు కష్టపడి తెరకెక్కించిన కలల ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి’ గత శుక్రవారం భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. కాకతీయ సామ్రాజ్యాన్ని తన ధైర్య, సాహసోపేతమైన నిర్ణయాలతో పాలించిన వీరనారి రాణీ రుద్రమదేవి కథగా తెరకెక్కిన సినిమా కావడంతో ‘రుద్రమదేవి’ సినిమాపై మొదట్నుంచే విపరీతమైన పాజిటివ్ బజ్ కనిపించింది. ఇక విడుదల తర్వాత కూడా అదే స్థాయిలో ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కొల్లగొడుతోంది.
అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతూండడంతో పాటు పలువురు సినీ ప్రముఖులు గుణశేఖర్ ప్రయత్నానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా రాజకీయ నాయకులు సైతం రుద్రమదేవి సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు రుద్రమదేవి టీమ్ ఓ స్పెషల్ షో ఏర్పాటు చేసింది. ఈ షోకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక షో పూర్తయ్యాక వీరు మాట్లాడుతూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడి ప్రయత్నానికి నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.

