సమీక్ష : సాహో – యాక్షన్ లవర్స్ కి మాత్రమే !

సమీక్ష : సాహో – యాక్షన్ లవర్స్ కి మాత్రమే !

Published on Aug 31, 2019 1:00 PM IST
Saaho movie review

విడుదల తేదీ : ఆగస్టు 30, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : ప్రభాస్, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, ఛంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ, లాల్, మురళి శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు.

దర్శకత్వం : సుజిత్

నిర్మాత‌లు : ప్రమోద్, వంశీ, విక్ర‌మ్

సంగీతం : జిబ్రాన్

సినిమాటోగ్రఫర్ : ఆర్ మధీ

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న చిత్రం ‘సాహో’. టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్రమోద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

అశోక్ చక్రవర్తి (ప్రభాస్) అమృత నాయర్ (శ్రద్ధా దాస్) ఇద్దరూ పోలీస్ ఆఫీసర్స్. ఓ భారీ దోపిడీ కేసును ఛేదించే క్రమంలో ఇద్దరు ఓ టీమ్ లో కలిసి పని చెయ్యాల్సి వస్తోంది. అయితే ఆ టీమ్ లో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు. రాబరీ గురించి.. అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టీవిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీమ్ ని లీడ్ చేస్తుంటాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపులతో కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది. అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి ? భారీ చోరీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ? ఆ మలుపు తిరగటానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమయ్యాడు? మధ్యలో సడెన్ గా సాహో (ప్రభాస్) కథలోకి ఎలా ఎంటర్ అయ్యాడు? పోలీస్ అశోక్ చక్రవర్తి (ప్రభాస్ )కి, సాహో (ప్రభాస్)కి మధ్య సంబంధం ఏమిటి ? ఇంతకీ వీళ్లు ఒకరా, ఇద్దరా? అసలు ప్రభాస్ ఎవరు ? అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి? మొత్తానికి ఈ కథను మొత్తం నడిపించింది ఎవరు ? ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ లు ఎదుర్కొన్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

అత్యంత భారీ అంచనాలతో ప్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా, అద్భుతమైన విజువల్స్ తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తారాగణంతో తెరకెక్కించబడటమే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కు సుజిత్ సాహో రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. సినిమా చూస్తున్నంతసేపూ ఓ అత్యుత్తమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

ఇక కథానాయకగా నటించిన శ్రద్ధా కపూర్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ శ్రద్ధా కపూర్ పలికించిన హావభావాలు చాల బాగున్నాయి. ప్రభాస్ – శ్రద్ధా కపూర్ మధ్య కెమిస్ట్రీ మరియు ప్రభాస్ క్యారెక్టర్ లోని షేడ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో కీలక మైన మరియు క్రూరమైన పాత్రలో నటించిన విలన్ ఛంకీ పాండే తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. విలన్స్ కి సంబంధించిన. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో వాళ్ళ నటన చాల బాగుంది.

అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ, లాల్, మురళి శర్మ, వెన్నెల కిషోర్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. సుజిత్ ఎక్కడా విజువల్ ట్రీట్ తగ్గకుండా.. మరియు భారీ యాక్షన్స్ సీన్స్ తో సినిమాని నడిపాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్, అండ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్స్ స్, మరియు ప్రభాస్ – శ్రద్ధా మధ్య ట్రాక్, ఛేజింగ్ సీన్స్, అదేవిదంగా క్లైమాక్స్ లోని ట్విస్ట్ లు, అండ్ ప్రభాస్ యాక్షన్ పార్ట్.. సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా థ్రిల్లింగ్ ప్లేతో సాగే ఈ సినిమా, ట్విస్ట్ లు అండ్ యాక్షన్ లాంటి కీలక అంశాలు పరంగా ఆకట్టుకున్నా.. కథ పరంగా సినిమాలో ఎలాంటి కొత్తధనం లేదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండాఫ్ లలో వచ్చే సాగదీత సీన్స్ బోరింగ్ ట్రీట్మెంట్, ఇంట్రస్ట్ గా సాగని మెయిన్ సీక్వెన్స్ స్ అదే విధంగా ముందుగానే అర్ధమయ్యే కొన్ని ట్విస్ట్ లు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. దర్శకుడు ఫస్టాఫ్ ను ఆసక్తికరమైన విజువల్స్ తో నడిపినా.. స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను బాగా నెమ్మదిగా నడిపారు. అలాగే సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి. ముఖ్యంగా ఆ సీన్స్ లో ఇంట్రస్ట్ మిస్ అయింది. స్క్రీన్ ప్లే ‘బి.సి’ సెంటర్ ఆడియన్స్ కి కూడా అర్ధమయ్యేలా ఇంట్రస్టింగ్ గా ఉండి ఉంటే ఈ సినిమా పూర్తి సంతృప్తికరంగా ఉండి ఉండేది.

ఇక కొన్ని సీన్స్ లో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కూడా సినిమా స్థాయికి తగ్గట్లు లేవు. అలాగే సినిమాలో కొన్ని సీన్స్ ఆసక్తికరంగా సాగకపోవడంతో రన్నింగ్ టైం ఎక్కువ ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. పైగా స్టోరీ కంటే కూడా సినిమాలో యాక్షన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని చోట్ల కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం, విలన్స్ కూడా ఎక్కువ అవ్వడం కూడా సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

 

సాంకేతిక విభాగం :

 

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే…మధి సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా ఆయన కథాకథనాలకు అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అయితే సినిమాలో స్లోగా సాగే సీన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది.

ఇక సంగీత దర్శకులు తనిష్క్ బాగ్చి, గురు రాంధ్వా, బాద్షా, శంకర్ ఎహసాన్ లాయ్ సమకూర్చిన పాటలు వినడానికి కంటే.. స్క్రీన్ మీద బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అలాగే జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాతలు ప్రమోద్, వంశీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

 

తీర్పు :

 

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా వచ్చిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తో, థ్రిల్ చేసే ట్విస్ట్ లతో, అండ్ వావ్ అనిపించే స్పెషల్ ఎఫెక్ట్స్ తో మరియు బలమైన ప్రభాస్ స్క్రీన్ ప్రేజన్సీతో ఆసక్తికరంగా సాగినప్పటికీ.. స్లోగా సాగే సీన్స్ తో అక్కడక్కడ బోరింగ్ ట్రీట్మెంట్ తో, బలం లేని మెయిన్ సీక్వెన్స్ స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగుతూ బోర్ కొడుతోంది. కానీ సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ భారీ విజువల్స్ మరియు గ్రేట్ స్పెషల్ ఎఫెక్ట్స్, ప్రభాస్ నటన బాగా అలరిస్తాయి. మొత్తానికి ‘సాహో’ కథతో ఆకట్టుకోలేకపోయినా.. ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఓ మంచి విజువల్ ట్రీట్ లా అనిపిస్తోంది.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు