విడుదల తేదీ : మే 09, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపుడి తదితరులు
దర్శకత్వం : ప్రవీణ్ కాండ్రేగుల
నిర్మాణ సంస్థ : ట్రలాలా మూవింగ్ పిక్చర్స్
సంగీతం : షోర్ పోలీస్
బ్యాక్గ్రౌండ్ స్కోర్ : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ : మృదుల్ సుజిత్ సేన్
ఎడిటర్ : ధర్మేంద్ర కాకర్ల
సంబంధిత లింక్స్ : ట్రైలర్
హీరోయిన్ సమంత నిర్మాతగా అలాగే ఆమె క్యామియోలో కూడా నటించిన లేటెస్ట్ చిత్రమే “శుభం”. క్లీన్ హిట్ సినిమా బండి దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన ఈ చిత్రం మంచి బజ్ ని ముందే సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
2000 దశకంలో నడిచే కథ ఇది కాగా విశాఖపట్నం, భీమిలి ప్రాంతంలో మన టౌన్ కేబుల్ టీవీ నడిపిస్తూ శ్రీనివాస్ (హర్షిత్ ఆర్) అమ్మ నాన్నలు చూసిన పెళ్లి సంబంధానికి వెళ్తాడు. అలా శ్రీవల్లి (శ్రియా కొంతం) ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఇలా అయ్యాక తన మొదటిరాత్రి రోజు సరిగ్గా 9 అయ్యేసరికి ఓ సీరియల్ చూస్తూ శ్రీనివాస్ కి దయ్యం పట్టినట్టుగా షాకిస్తుంది. ఇక్కడ నుంచి మొదలైన ఈ తతంగం ఎలా సాగింది? ఈ సమస్య తనకే కాదు తన ఫ్రెండ్స్ (శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ పెరి) భార్యలు ఫరీదా (షాలిని కొండెపూడి), గాయత్రి (శ్రావణి లక్ష్మి) లకి కూడా జరుగుతుంది అని తెలుసుకుంటారు. మరి వారికి సరిగ్గా సీరియల్ సమయంలోనే ఎందుకు దయ్యం పడుతుంది? ఇంతకీ ఆ సీరియల్ ఏంటి? ఆ సీరియల్ ని ఎలా ఎండ్ చేశారు? ఈ క్రమంలో మంత్రగత్తె మాయ శ్రీ (సమంత) చూపించిన పరిష్కారం ఏంటి? చివరికి దయ్యాలు వదిలాయా లేదా ఆ దయ్యాలు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
మెయిన్ గా ఈ సినిమాలో పాయింట్ ఒకింత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. సీరియల్స్ తో కూడా హారర్ బ్యాక్ డ్రాప్ లో అది కూడా మంచి హిలేరియస్ గా చూపించడం అనేది సాధ్యమవుతుంది అనేది దర్శకుడు చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఒక రెగ్యులర్ స్టార్ట్ తర్వాత సినిమా పికప్ అయ్యిన విధానం అలాగే ఒక క్లీన్ కామెడీతో సాగే కథనం ఆడియెన్స్ ని ముఖ్యంగా మహిళలని లీనం అయ్యేలా చేస్తాయి.
అంతే కాకుండా అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ అయితే మరింత హిలేరియస్ గా సినిమాలో పేలతాయి. వీటితో ఈ చిత్రం సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని అన్ని వర్గాల ఆడియెన్స్ కి అందిస్తుంది. అలాగే కేవలం ఈ ఫన్ మూమెంట్స్ మాత్రమే కాకుండా ఆకట్టుకునే బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఇంకా భార్య భర్తలపై కొన్ని మీనింగ్ ఫుల్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే అక్కడక్కడా హారర్ సీన్స్ కూడా డీసెంట్ ట్రీట్ ని అందిస్తాయి.
ఇక నటీనటుల్లో మొత్తం అంతా కూడా బాగా చేసారని చెప్పాలి. హర్షిత్ ఆర్ చాలా నాచురల్ గా మంచి నటన కనబరిచాడు. హారర్ సీన్స్ లో తన భార్యతో సన్నివేశాల్లో అలాగే కన్ఫ్యూజ్డ్ సన్నివేశాల్లో తన టైమింగ్ బాగుంది. అలాగే తన సరసన నటించిన శ్రియా కొంతం బ్యూటిఫుల్ గా కనిపిస్తూ తాను కూడా మంచి సహజమైన నటనను అందించింది. ఇక వీరితో పాటుగా వారికి ఫ్రెండ్స్ గా నటించిన చరణ్ పెరి, శ్రీనివాస్ రెడ్డిలు ఆల్పా మేల్స్ గా బాగా చేశారు.
వారిపై పలు కామెడీ సీన్స్ హిలేరియస్ గా వర్క్ అయ్యాయి. ఇంకా వారి భార్యలుగా చేసిన శ్రావణి లక్ష్మి, షాలిని కొండెపూడి కూడా బాగా చేశారు. ఇక వీరితో పాటుగా నటుడు వంశీధర్ గౌడ్ కూడా తన రోల్ లో భలే చేశారు. కొన్ని కామెడీ సీన్స్ అయితే మామూలు హిలేరియస్ గా ఉండవు. ఇక ఫైనల్ గా స్పెషల్ రోల్ లో కనిపించిన రాగ్ మయూర్ అండ్ సినిమా బండి టీం ఎంట్రీ నుంచి కథనం మరింత ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. ఇక సమంత కూడా చిన్న క్యామియోలో తన రోల్ కి న్యాయం చేకూర్చారు.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో లైన్ బాగానే ఉంది కానీ చాలా మందికి ఇది ఒకింత సిల్లీగా కూడా అనిపించవచ్చు. నిజ జీవితంలో ఇలాంటివి వర్కౌట్ అవుతాయా? అనే ప్రశ్న ఒక సమయంలో ఆడియెన్స్ లో రాక మానదు. అలాగే సినిమా స్టార్టింగ్ లో కథనం కొంచెం స్లోగానే మొదలవుతుంది. సో మెయిన్ అంశంలోకి వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది.
ఇక వీటితో పాటుగా సెకండాఫ్ లో హారర్ ఎలిమెంట్స్ ఒకింత ఓవర్ గా అనిపిస్తాయి. ముగ్గురు ఫీమేల్ లీడ్స్ పై చూపించే ఆ కొన్ని సన్నివేశాలు రిపీటెడ్ గా ఓవర్ డ్రమాటిక్ గా తీసినట్టు అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో కథనం అక్కడక్కడా కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇంకా సమంత రోల్ ని ఇంకొంచెం బాగా డిజైన్ చేయాల్సింది.
సాంకేతిక విభాగం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయని చెప్పాలి. నేపథ్యానికి తగ్గట్టుగా చేసుకున్న సెటప్ అంతా బాగుంది. మెయిన్ గా వింటేజ్ బ్యాక్ డ్రాప్ ని చక్కగా ఆవిష్కరించారు. ఒక రెండు దశాబ్దాల కితం ఉన్న పరిస్థితులు వాటిని దర్శకుడు బాగా చూపించాడు. వివేక్ సాగర్ బ్యాక్గ్రౌంగ్ స్కోర్ సినిమాలో బాగుంది. షోర్ పోలీస్ పాటలు బాగున్నాయి. మ్రిదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ కూడా బాగుంది.
ఇక దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల విషయానికి వస్తే.. ఈ సినిమాకి తన వర్క్ మెప్పిస్తుంది. తన సినిమాకి ఒక సెపరేట్ వరల్డ్ ని తాను క్రియేట్ చేసుకున్నారు. అలా మంచి హారర్ కం ఫన్ ఎలిమెంట్స్ వీటికి మించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. వీటితో పాటుగా చిన్న చిన్న మైక్రో డీటెయిల్స్ తన నుంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.
ఉదాహరణకి రెండు సన్నివేశాలు చూస్తే హీరో కేబుల్ టీవీకి పోటీగా డిష్ కుమార్ కొన్ని ఛానెల్స్ పేర్లు చెబుతూ ఉంటాడు ఇందులో టూన్ డిస్నీ అనే ఛానెల్ కోసం కూడా చెబుతాడు. చాలా మందికి ఇది తెలిసి ఉండకపోవచ్చు కానీ దానిని దర్శకుడు చెప్పించడం, అలాగే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక దగ్గర కూర్చొని దేవునికి మొక్కుకుంటారు. ఒకేసారి అంతా చేస్తారు. కానీ ముగ్గురులో ఒకరు ముస్లిం ఆ ఇద్దరు ఒకలా ప్రార్ధిస్తే చరణ్ రోల్ వారి విధానంలో చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ బాగున్నాయి కానీ ఇంకొన్ని చోట్ల మాత్రం మిస్ అయ్యారు. అలాగే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ కి పర్ఫెక్ట్ గా శుభం అందించడం బాగుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “శుభం” చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా సీరియల్స్ చూసే మహిళా ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. నటీనటుల పెర్ఫామెన్స్ లు సహా దర్శకుని పనితనం ఇంకా కామెడీ సీన్స్, ఎమోషన్స్ వర్క్ అయ్యాయి. అయితే కొన్ని చోట్ల హారర్ సీన్స్ మాత్రం డ్రమాటిక్ గా అనిపిస్తాయి. అలాగే మెయిన్ పాయింట్ కూడా అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. వీటిని పక్కన పెడితే మీకు ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమాకి వెళితే మాత్రం డెఫినెట్ గా ఎంటర్టైన్ అయ్యి బయటకి వస్తారు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team