సముద్రఖని ప్రధాన పాత్రలో, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ విడుదలకు సిద్ధమైంది. రామ్ చక్రి దర్శకత్వంలో, పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ సినిమాకు పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ సినిమా కథ ఒక సాధారణ కార్ డ్రైవర్ ‘సెల్వం’ చుట్టూ తిరుగుతుంది. అత్యంత నిజాయితీగా బతికే ఒక సామాన్యుడు, ఆధునిక సమాజంలోని ఒత్తిళ్లు మరియు సవాళ్ల మధ్య తన జీవితాన్ని ఎలా సాగించాడు అనే అంశాన్ని దర్శకుడు ఎమోషనల్ డ్రామాగా మలిచారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన రాగా, త్వరలోనే టీజర్‌ను విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ.. ఈ కథ ప్రతి సామాన్యుడికి కనెక్ట్ అవుతుందని, పీవీఆర్ ఐనాక్స్ వంటి పెద్ద సంస్థ తోడవడంతో సినిమా మరింత ఎక్కువ మందికి చేరువవుతుందని ధీమా వ్యక్తం చేశారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


