అంగరంగ వైభవంగా సంతోషం సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 !

అంగరంగ వైభవంగా సంతోషం సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 !

Published on Oct 1, 2019 12:39 AM IST

Santhosham

శ్రియకు శ్రీదేవి స్మారక పురస్కారం.. బెస్ట్‌ యాక్టర్‌గా కార్తికేయ.. సంతోషం సినీ వారపత్రిక 17వ వార్షికోత్సవం, సంతోషం సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 ప్రదానోత్సవం చిత్రసీమ అతిరథ మహారథుల సమక్షంలో, వేలాది మంది ప్రేక్షకుల మధ్య అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం నిర్విరామంగా 6 గంటకు పైగా సాగిన ఈ వేడుకలో తారల ప్రసంగాలు, డాన్స్‌ పర్ఫార్మెన్స్‌లు, సరదా స్కిట్‌లు హైలైట్‌గా నిలిచాయి. అలనాటి తార జమున, ప్రభ, రోజారమణి, నటిదర్శకురాలు జీవిత, నటులు రాజేంద్రప్రసాద్‌, రాజశేఖర్‌, బాబూమోహన్‌, సునీల్‌, వెన్నెల కిశోర్‌, నేటి తారలు శ్రియ, శివానీ, శివాత్మిక, నటాషా దోషి, అవికా గోర్‌, దీప్తి సునయన, ప్రముఖ నిర్మాతలు డి. సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌, అంబికా కృష్ణ, దిల్‌ రాజు, తమిళ హీరో జయం రవి, సంగీత దర్శకుడు తమన్‌, గాయకుడు అనురాగ్‌ కులకర్ణి తదితరులు ఈ వేడుకకు అమితమైన ఆకర్షణ తీసుకొచ్చారు. ప్రముఖ ఫిల్మ్‌ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి సీనియర్‌ హాస్యనటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్‌ చేతుల మీదుగా ఫిల్మ్‌ జర్నలిజంలో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. పదిహేడు సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ వేడుకను ఒంటిచేత్తో నిర్వహించడం సురేష్‌ కొండేటికే సాధ్యమని బాబూ మోహన్‌ ప్రశంసించారు.

‘మహానటి’లో నటనకు గాను ఉత్తమ సపోర్టింగ్‌ ఆర్టిస్టు అవార్డును జమున చేతుల మీదుగా అందుకున్న డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావుగారు నా సినిమాలు చూసి ఆనందించేవారని చెప్పారు. అందుకు అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవార్డు రావడానికి కారకులు ఆ పాత్రను సృష్టించిన రచయితలు, దర్శకులు. వాళ్లిచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపర్చుకున్నాను. నేను మీరు ఫీలయినంతకాలం పనిచేస్తూనే వుంటాను. అల్లు అరవింద్‌ వంటి సీనియర్‌ నిర్మాతలు మంచి సినిమాలు తీసి అవకాశాలు ఇవ్వడం వల్ల ఇలాంటి అవార్డులు దక్కుతాయి. ఏ కళాకారుకారుడికైనా ఈ అవార్డులు ఉత్సాహాన్నిస్తాయి’’ అన్నారు. సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు సోలోగా నిర్మించిన మొదటి సినిమా ‘రాముడు భీముడు’లో జమున గారు హీరోయిన్‌గా నటించారు. నా చిన్నతనంలో మేము, ఆమె ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లం. నా చేతుల మీదుగా ఆమెకు అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు.

జమున మాట్లాడుతూ ‘‘అరవింద్‌, సురేశ్‌బాబు నా బిడ్డల్లాంటి వాళ్లు.. సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నిర్మాతలుగా ఉండడం ఆనందదాయకం. సురేష్‌ కొండేటి ఈ అవార్డును అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు. అల్లు రామలింగయ్య అవార్డును అల్లు అరవింద్‌ చేతుల మీదుగా అందుకున్న వెన్నెల కిశోర్‌ మాట్లాడుతూ ‘‘మామూలుగా ఒక అవార్డు తీసుకెళ్లినప్పుడు.. నా పేరు చూసి హ్యాపీగా ఫీలయ్వేవాడిని. కానీ ఈ అవార్డుపై అల్లు రామలింగయ్యగారి పేరు చూసి ఇంట్లో గర్వంగా ఫీలవుతారు. ఈ అవార్డును నా రచయితలకు, దర్శకులకు అంకితమిస్తున్నా. నేను ఈ జన్మకు హీరోగా చేయను. హీరో ఫ్రెండ్‌గా చాలు. హీరో అవ్వాలంటే దానికి అర్హత కావాలి. ఆ క్వాలిఫికేషన్‌ లేదు. బాడీ ఔటాఫ్‌.. ఫుడ్‌ త్యాగం చేయలేను’’ అని నవ్వించారు.

‘అరవింద సమేత’లో నటనకు గాను బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవార్డును రాజశేఖర్‌, కార్తికేయ, జీవిత చేతుల మీదుగా తమన్‌ అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘అరవింద సమేత నాకు చాలా స్పెషల్‌.. ఇది నా 100 సినిమా. ఈ అవార్డును తారక్‌, త్రివిక్రమ్‌లకు అంకితం ఇస్తున్నా. సీతారామ శాస్త్రి గారి వంటి లెజెండరీ రైటర్‌ మనకు ఉండడం మన అదృష్టం. నేను ఆయనను పెదనాన్న అని పిసుస్తుంటా. ఈ వేడుకను ఎంత కష్టమైనా ఎంత ఇష్టంగా సురేశ్‌ చేస్తుంటారో నాకు తెలుసు’’ అని చెప్పారు. తమిళంలో ‘అడంగమరు’ చిత్రంలో నటనకు గాను బెస్ట్‌ యాక్టర్‌గా సురేష్‌ బాబు, దిల్‌ రాజు చేతుల మీదుగా అవార్డు అందుకున్న జయం రవి మాట్లాడుతూ ‘‘ఈ అవార్డు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. లెజెండ్స్‌ ముందు ఈ అవార్డు తీసుకుంటున్నా. సురేష్‌ గారికి చాలా థ్యాంక్స్‌. ‘అడంగమరు’ నాకు చాలా బాగా నచ్చిన సినిమా. ఎడిటర్‌ మోహన్‌గారు మానాన్న గారు. చాలా హిట్‌ సినిమాలకు పని చేశారు. నేను ఈ ఇండస్ట్రీలో సిన్సియర్‌గా ఉంటున్నానంటే.. ఆ గుణం ఆయన నుంచే వచ్చిందే’’ అన్నారు. ‘పందెంకోడి 2’, ‘సర్కార్‌’ చిత్రాల్లో నటనకు గాను బెస్ట్‌ విలన్‌ (తమిళం)గా అవార్డు అందుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘పందెంకోడి 2 దర్శకుడు లింగుస్వామి, ‘సర్కార్‌’ దర్శకుడు మురుగదాస్‌కు ధన్యవాదాలు.. మీ ప్రేమకు థాంక్స్‌. తెలుగులో మరిన్ని సినిమాలతో రావాలని ట్రై చేస్తున్నా’’ అన్నారు.

ఉదయభాను, సమీర్‌, తనీష్‌, తేజస్విని మదివాడ యాంకర్లుగా వ్యవహరించిన ఈ వేడుకలో కామెడీ హీరో సంపూర్ణేష్‌బాబు, హీరోయిన్లు నభా నటేష్‌, అవికా గోర్‌, నటాషా దోషి, తేజస్విని, దీప్తి సునయన చేసిన డాన్స్‌ పర్ఫార్మెన్సులు, సింగర్స్‌ రఘురామ్‌, శ్రుతి, గాయత్రి ఆలపించిన పాటలు, ఉప్పల్‌ బాలు పర్ఫార్మెన్స్‌ ఆహూతుల్ని అమితంగా అలరించాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు