పాట షూట్ కోసం ‘ఉయుని’ వెళ్తున్న ‘సరైనోడు’ టీమ్

sarainodu
బోయపాటి శీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘సరైనోడు’ సినిమా ప్రస్తుతం బొలీవియాలో షూటింగ్ జరుపుకుంటోంది. హీరో అల్లు అర్జున్, హీరోయిన రాకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ కోసం దర్శకుడు బోయపాటి కొత్తగా ఉంటుందనే ఉద్దేశ్యంతో బోలీవియాను ఎంచుకున్నాడు. ఐతే ప్రస్తుతం టీమ్ మొత్తం షూటింగ్ కోసం దక్షిణ బొలీవియాలోని ‘ఉయుని’ అనే నగరానికి బయలుదేరింది. ఈ నగరం ప్రత్యేకత ఏమిటంటే నగరమంతా ఉప్పుతో కప్పబడి తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది.

ఎటుచూసినా కనుచూపు మేర ఉప్పు మాత్రమే కనిపించే ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే చాలా గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్నే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ లొకేషన్లో తీయబోయే సాంగ్ మొత్తం చిత్రానికే హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. పైగా అలాంటి లొకేషన్లో చిత్రీకరణ జరుపుకోబోయే మొదటి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. తెలుగు సినిమా రంగంలో నిర్మాణ విలువలు బాగా పెరగడంతో దర్శకనిర్మాతలు గొప్పగొప్ప లోకేషన్లలో షూటింగ్ జరపడానికి వెనుకాడటంలేదనే విషయానికి ఈ సినిమానే నిదర్శనం.

Exit mobile version