
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సరైనోడు’ అనే మాస్ ఎంటర్‌టైనర్‌తో వచ్చి ఎవరి ఊహకూ అందని రీతిలో సూపర్ హిట్ కొట్టేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా, ఆ టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా అభిమానుల మన్ననలు పొందుతూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ వచ్చింది. ఇక ఇప్పటివరకూ ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. దీంతో అల్లు అర్జున్ తన స్టార్ స్టామినాను మరింతగా పెంచుకున్నారనే చెప్పొచ్చు.
ఏప్రిల్ 22న విడుదలైన ఈ సినిమా మూడో వారాంతం ముగిసే సరికి ఈ ఫీట్ సాధించింది. ఇక గ్రాస్ కలెక్షన్స్ 100 కోట్లు కాగా, షేర్ కలెక్షన్స్ 62 కోట్ల రూపాయలుగా తేలాయి. అల్లు అర్జున్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేందుకు సరైనోడు సిద్ధమైపోయింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా అల్లు అర్జున్‌ను మాస్ హీరోగా పరిచయం చేస్తుందన్న ప్రచారంతో వచ్చి ఈ విషయంలో విజయం సాధించింది. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్, క్యాథరిన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.