సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల ‘జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్’ సమర్పణలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే గ్లింప్స్, టీజర్లతో భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా విశేషాలను తాజా విలేకరుల సమావేశంలో హీరో సత్యదేవ్ పంచుకున్నారు.
‘రావు బహదూర్’పై మీ టీమ్ అందరూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు… కారణం?
సినిమా చూసిన తర్వాతే మాకు నమ్మకం వచ్చింది. మేము సినిమా మొదలుపెట్టినప్పుడు అనుకున్న ‘మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా’ అనే ట్యాగ్‌లైన్‌ను.. సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు గారితో పాటు ఇతర ఫిలిం మేకర్స్ కూడా అదే విధంగా అనడం మాకు ఎంతో సంతోషాన్ని, ధీమాను ఇచ్చింది.
రావు బహదూర్ జానర్ ఏమిటి?
ఇది మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ సబ్‌జానర్స్‌తో కూడిన కంప్లీట్ సైకాలజికల్ డ్రామా. మెటాఫర్‌ను విజువల్‌గా చూపించే క్రమంలో కొన్నిసార్లు ఇది హారర్‌లా అనిపించవచ్చు. టీజర్‌లో వేర్లు వెంటాడే విజువల్ లాంటివి థియేటర్‌లో చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు చాలా క్లియర్‌గా అర్థమవుతాయి.
రావు బహదూర్‌లో రామప్ప క్యారెక్టర్‌కు ఉన్న రిఫరెన్స్ ఏంటి?
నిజానికి ఈ సినిమాలో రామప్ప క్యారెక్టర్‌కు ఎలాంటి ముందస్తు రిఫరెన్స్ లేదు. అది ఒక వెరీ మ్యాడ్ క్యారెక్టర్. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆ పాత్ర నన్ను ఆవహించిందా అన్నంతగా లీనమైపోయాను. ఇకపై ఎవరైనా ఇలాంటి పాత్ర చేయాలంటే రామప్పే ఒక రిఫరెన్స్ పాయింట్ అవుతాడు. దర్శకుడు వెంకటేష్ మహా ప్రతి సన్నివేశాన్ని చాలా రిచ్ రైటింగ్, అద్భుతమైన డీటైలింగ్ మరియు లేయర్స్‌తో తెరకెక్కించారు, ఇది ప్రేక్షకులను సినిమాను రిపీట్‌గా చూసేలా చేస్తుంది.
దీప థామస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, హీరోయిన్ నాతో సమానంగా అద్భుతంగా నటించింది. అలాగే ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఈ సినిమా కోసం మీరు ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏమిటి?
ఈ సినిమా కోసం ఫిజికల్‌గా కొన్ని ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నప్పటికీ, మెంటల్‌గా మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. యాక్టర్‌గా దీన్ని ఒక వర్క్‌లా కాకుండా నాకు నచ్చిన పనిగా భావిస్తాను. నా నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎందుకు ఎదురు చూడాలి అని నన్ను నేను ఒక ఆడియన్స్‌లా ప్రశ్నించుకుంటూ ఉంటాను.
మహేష్ బాబు గారు సినిమా చూసి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు?
మహేష్ బాబు, నమ్రత, సుకుమార్ గారు ఈ సినిమా చూసి ‘మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా’ అని ప్రశంసించారు. ఒకప్పుడు నా సీన్ కట్ అయిన సినిమా హీరో మహేష్ బాబు గారే ఇప్పుడు నా చిత్రానికి వెలకట్టలేని వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతలు శరత్, అనురాగ్, గోపాల్ గార్లు మార్కెట్ బాధ్యతలను భుజాన వేసుకుని ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. కొత్తదనాన్ని కోరుకునే మన తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక సరికొత్త అనుభూతిని ఇస్తూ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.
రావు బహదూర్ ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది?
ఇది ఒక డిఫరెంట్ విజువల్ స్పెక్టాకిల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. ప్రేక్షకుడు పెట్టే టికెట్‌కు పూర్తి విలువ ఇచ్చే సినిమా.
మీ నెక్స్ట్ సినిమాలు?
‘సమవర్తి’ ఇప్పటివరకు నేను చేయని సినిమా. అది ఒక ఫారెస్ట్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఒక కామెడీ సినిమాతో పాటు ‘ఫుల్ బాటిల్’ అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా చేస్తున్నాను.


