హ్యాట్రిక్ హిట్స్‌తో జోరు మీదున్న నిఖిల్ అదే జోరును కొనసాగించాలన్న ఆలోచనతో ‘శంకరాభరణం’ అన్న సినిమాతో మనముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత కొద్దికాలంగా టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటిగా చెప్పబడుతూ వచ్చిన ఈ సినిమా గత శుక్రవారం పెద్ద ఎత్తున థియేటర్లలో వాలిపోయింది. హ్యాట్రిక్ హిట్స్ హీరో నిఖిల్ సినిమా కావడం, ప్రముఖ రచయిత కోనవెంకట్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతో పాటు అన్నీ తానై నిర్మించడంతో ‘శంకరాభరణం’ సినిమాకు మొదట్నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే మొదటి వీకెండ్ ఈ సినిమా నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ‘శంకరాభరణం’ కథ, కథనాల విషయంలో మాత్రం మొదట్నుంచీ విమర్శలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిఖిల్ తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.
శంకరాభరణం సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ గురించి మాట్లాడుతూ.. “శంకరాభరణం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ నా కెరీర్లోనే బిగ్గెస్ట్. నాపై నమ్మకం ఉంచిన అందరికీ థ్యాంక్స్. శంకరాభరణం సినిమాలో కొన్ని లోపాలున్న విషయం వాస్తవమే. అయితే ఈ సినిమా ఎవరినైతే టార్గెట్ చేశామో వారికి సరిగ్గా రీచ్ అయింది. ఇక ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఒక సినిమా ఉండాలన్న సరైన ఆలోచనతో, అన్నీ ఆలోచించి తీసుకున్న నిర్ణయమే శంకరాభరణం. ఎప్పటికప్పుడు కొత్తదనమున్న సినిమాలతో అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా” అని తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలిపారు.


