టాప్ క్లాస్ విజువల్స్‌తో కట్టిపడేస్తోన్న ‘శంకరాభరణం’!

Shankarabaranam
‘శంకరాభరణం’.. వరుసగా విలక్షణ కథలను ఎంచుకుంటూ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరో నిఖిల్ నటించిన తాజా సినిమా. తనకు బాగా కలిసివచ్చిన క్రైమ్ కామెడీ జానర్లో నిఖిల్ చేస్తోన్న ఈ కొత్త ప్రయోగంతో ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తూ రూపొందించడంతో ఈ సినిమాపై సాధారణంగానే మొదట్నుంచీ మంచి అంచనాలు కనిపిస్తూ వచ్చాయి. ఇక ఈ ఉదయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ‘శంకరాభరణం’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయడంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.

పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఈ టీజర్ చూశాక సినిమాపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలన్నీ రెట్టింపు అయ్యాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక మీడియమ్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కినా, రిచ్ క్లాస్ విజువల్స్‌తో ఈ టీజర్ కట్టిపడేయడం ఆసక్తిగా కనిపించింది. ఈ సినిమాలో నిఖిల్ ఓ ఎన్నారైగా కనిపిస్తున్నారు. దీంతో అమెరికా నేపథ్యం కొంత, ఆ తర్వాత బీహార్ నేపథ్యం కలుపుకొని ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇక ఈ టీజర్‌లో అమెరికా, బీహార్‌లలో సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉన్న విజువల్స్ చాలా బాగున్నాయని చెప్పొచ్చు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. చివర్లో ‘అబ్ ఆయేగా అస్‌లీ దివాళీ’ అంటూ అంజలి మెరవడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. నిఖిల్ సరసన నందిత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్‌లో విడుదల కానుంది.

Exit mobile version