ఓటీటీ సమీక్ష: సివరపల్లి – అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వెబ్ సిరీస్

ఓటీటీ సమీక్ష: సివరపల్లి – అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వెబ్ సిరీస్

Published on Jan 26, 2025 2:58 AM IST


విడుదల తేదీ : జనవరి 24, 2025

123telugu.com Rating : 3/5

నటీనటులు : మురళీధర్ గౌడ్, పావని కరణం, రాగ్ మయూర్, రూపలక్ష్మీ, ఉదయ్ గుర్రాల, సన్నీ పల్లె తదితరులు

దర్శకుడు : భాస్కర్ మౌర్య

నిర్మాతలు : విజయ్ కోశి, అరుణభ్ కుమార్, రవికిరణ్ మదినేడి

సంగీతం : సింజిత్ ఎర్రమిల్లి

సినిమాటోగ్రఫీ : వాసు పెండెం

ఎడిటర్ : సాయి మురళి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

హిందీలో తెరకెక్కిన ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌ను తెలుగులో ‘సివరపల్లి’ అనే పేరుతో రీమేక్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘సివరపల్లి’ వెబ్ సిరీస్ జనవరి 24 నుంచి స్ట్రీమింగ్‌కి వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
బీటెక్ పూర్తి చేసిన శ్యామ్(రాగ్ మయూర్) తన స్నేహితుల లాగా పై చదువుల కోసం అమెరికా వెళ్లాలని అనుకుంటాడు. అయితే, తన తండ్రి బలవంతంతో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మారుమూల గ్రామం అయిన సివరపల్లి లో శ్యామ్ పోస్టింగ్ అవుతుంది. ఆ ఊరిలో మహిళా సర్పంచ్ సుశీల(రూపలక్ష్మీ) ఇంటికే పరిమితం అవగా.. ఆమె భర్త సుధాకర్(మురళీధర్ గౌడ్) పెత్తనం చేస్తుంటాడు. తనకు ఇష్టం లేకున్నా ఉద్యోగంలో జాయిన్ అయిన శ్యామ్ ఆ పల్లెటూరులో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు..? పంచాయతీ ఆఫీస్ ఉద్యోగులు, సర్పంచ్ భర్తతో శ్యామ్ ఎలాంటి కష్టాలను అనుభవిస్తాడు..? శ్యామ్ అమెరికా వెళ్లాలనే ప్రయత్నం ఫలిస్తుందా..? అనేది ఈ వెబ్ సిరీస్ కథ.

ప్లస్ పాయింట్స్:
హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ కథను రీమేక్ చేసినప్పటికీ, సివరపల్లి కథ తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్‌లో తెలంగాణ నేపథ్యంలోని ఓ మారుమూల గ్రామం.. అక్కడి ప్రజల తీరు, కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రటరీతో వారు నడుచుకునే విధానం చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్‌లోని డైలాగ్స్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతాయి.

పక్కా గ్రామీణ నేపథ్యాన్ని మరోసారి ప్రేక్షకులకు చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. పల్లెటూరిలో పంచాయతీ ఆఫీస్ ఎలా ఉంటుందనేది మన కళ్లకు కట్టినట్లు చూపెట్టారు. ఇక అమాయకమైన గ్రామస్థులతో శ్యామ్ ప్రవర్తించే తీరు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. ఇక గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకురావాలనే పాయింట్‌ను టచ్ చేసిన తీరు బాగుంది.

శ్యామ్ పాత్రలో రాగ్ మయూర్ ఆకట్టుకుంటాడు. అటు సర్పంచ్ భర్తగా మురళీధర్ గౌడ్ మరోసారి తన నటనతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ఈ కథను దర్శకుడు భాస్కర్ మౌర్య మలిచిన తీరు ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఎలాంటి ట్విస్ట్ లు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా ఓ ప్యూర్ ఫ్యామిలీ ఆడియెన్స్ కంటెంట్‌గా ‘సివరపల్లి’ ప్రేక్షకులను అలరిస్తుంది.

మైనస్ పాయింట్స్:
ఇలాంటి వెబ్ సిరీస్‌లలో కథ ఎంత సింపుల్‌గా ఉన్నా, ఎంటర్టైన్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ‘సివరపల్లి’లో ఈ ఎంటర్టైన్మెంట్ కొంతమేర మిస్ అయ్యిందని చెప్పాలి. కామెడీ సీన్స్ ఉన్నప్పటికీ అవి అక్కడక్కడ నవ్వులు తెప్పిస్తాయి. మరికొన్ని సీన్స్ అయితే, ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్లుగా అనిపిస్తాయి.

ఇక ఇలాంటి వెబ్ సిరీస్‌కు రన్‌టైమ్ కూడా చాలా ముఖ్యం. సివరపల్లి వెబ్ సిరీస్ రన్‌టైమ్ చాలా లెంగ్తీగా అనిపిస్తుంది. దాదాపు నాలుగున్నర గంటల సేపు ఇలాంటి సింపుల్ కథను సాగదీసి నడిపినట్లు ఆడియన్స్ ఫీల్ అవుతారు. కొన్ని ల్యాగ్ సీన్స్ కూడా ఈ వెబ్ సిరీస్‌కు మైనస్ అని చెప్పాలి.

కొన్ని సీక్వెన్స్‌లు అనవసరంగా పెట్టినట్లు అనిపిస్తాయి. కొన్ని పాత్రలు మినహా మిగతా పాత్రల్లో నటించిన వారిని గుర్తించని కారణంగా ఆడియెన్స్ చాలా సీన్స్‌ను స్కిప్ చేసే అవకాశం ఉంది.

సాంకేతిక వర్గం:
ఇలాంటి రీమేక్ వెబ్ సిరీస్‌ని పక్కా తెలుగు నేటివిటీ కథతో ప్రేక్షకులను అలరించేందుకు దర్శకుడు భాస్కర్ మౌర్య చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. ఈ ప్రయత్నంలో ఆయన చాలా వరకు విజయం సాధించారని చెప్పాలి. ఎలాంటి వారికైనా ఈ కథ బాగా కనెక్ట్ అయ్యేలా ఆయన తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ కూడా మరో అసెట్‌గా నిలిచింది. పల్లెటూరి వాతావరణం, అక్కడి ప్రజల ప్రవర్తనను చాలా బాగా చూపెట్టారు. సింజిత్ యెర్రమిల్లి మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. కొన్ని ల్యాగ్ సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు:
ఓవరాల్‌గా ‘సివరపల్లి’ ఒక పక్కా పల్లెటూరి నేపథ్యంలో, చాలా సింపుల్ లైన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎలాంటి ఓవర్ ట్విస్టులు, బూతులు లేకుండా ఓ చక్కటి ఫ్యామిలీ కంటెంట్ కథగా ఈ వెబ్ సిరీస్ నిలిచింది. అయితే రన్‌టైమ్ ఎక్కువగా ఉండటం, అక్కడక్కడా ల్యాగ్ సీన్స్ ఉండటం మైనస్. విలేజ్ బ్యాక్‌డ్రాప్ వెబ్ సిరీస్‌లు ఇష్టపడేవారు ‘సివరపల్లి’ని ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు