
‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ‘రేసుగుర్రం’ లాంటి సూపర్ హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ప్రచార చిత్రాలు, ట్రైలర్ ద్వారా ఇప్పటికే ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించిన సన్నాఫ్ సత్యమూర్తి, విడుదలకు ముందే సంచనాలను నమోదు చేసిన విషయం తెలిసిందే! సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మార్చి 15న విడుదల అయిన ఆడియో అభిమానుల్లో జోరును నింపింది. ఇక ఆడియో సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా ఈ ఆడియోకి సంబంధించిన సక్సెస్ మీట్‌ను నిన్న సాయంత్రం నిర్వహించారు. విజయవాడలోని హాయ్‌లాండ్‌ను ఆడియో సక్సెస్ మీట్‌కు వేదికగా ఎంచుకున్నారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్, హీరోయిన్ అదా శర్మ, నిర్మాత రాధాకృష్ణ, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, ఆలీ, బ్రహ్మనందం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్.. నాన్నపై మనకుండే అభిప్రాయాలు, గౌరవం వయసును బట్టి మారుతా ఉంటాయని, మనకోసం ఎన్నో త్యాగాలు చేసే వ్యక్తుల్లో మొదటి వరుసలో నాన్న ఉంటాడని భావోద్వేగంగా మాట్లాడారు. త్రివిక్రమ్ సినిమాల్లో, మాటల్లో ఉన్న గాఢతే ఆయన బయట మాట్లాడుతున్నప్పుడూ కనిపిస్తుందనడంలో సందేహం లేదు. నాన్న మనతో ఉన్నపుడే మనం ఆయన్ని గుర్తించాలని, ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవాలని ఆయన అన్నారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా నాన్నకిచ్చే గొప్ప గౌరవమని ఆయన అన్నారు. నాన్నలందరికీ ఈ సినిమా అంకితమని స్పష్టం చేశారు.
ఈ సక్సెస్ మీట్‌కు భారీ ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యారు. సినిమాపై ఇటు అభిమానుల్లోనూ, అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలన్నీ అందుకునే రేంజ్‌లోనే సినిమా ఉండనుందనేది సమాచారం. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఏప్రిల్ 9న విడుదల కానుంది.

