చిరంజీవి మీద సోనూ సూద్ ప్రశంసలు

Published on Jun 8, 2021 8:03 pm IST

నటుడు సోనూ సూద్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా రోజూ వందలాది మంది సహాయం పొందుతున్నారు. మొదటి లాక్ డౌన్ టైంలో మొదలైన ఆయన సేవా కార్యక్రమాలు ఇప్పుడు మరింత పుంజుకున్నాయి. హాస్పిటల్ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు స్కాలర్ షిప్స్ ఇలా అనేక రకాలుగా ఆయన సేవలు అందిస్తున్నారు. తెలుగునాట కూడ మెగాస్టార్ చిరంజీవి కూడ పెద్ద ఎత్తున చేయూతను అందిస్తున్నారు.

సొంత డబ్బుతో ఆక్సిజన్ బ్యాంక్స్ స్థాపించి ఆపదలో ఉన్నవారికి ప్రాణవాయువును అందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటయ్యాయి. అంతేకాదు కరోనా క్రైసిస్ ఛారిటీ నిధులతో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. చిరంజీవి చేస్తున్న సేవలకుగాను తెలుగు జనం ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సోనూ సూద్ సైతం చిరంజీవి సేవలను కొనియాడారు. చిరంజీవి, రామ్ చరణ్‌ల నిర్ణయం ఎంతో గొప్పది, ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభించడం ఎంతో స్ఫూర్తిదాయకమని, సెలబ్రిటీలు ఇలా ముందుకొచ్చి సహాయం అందిస్తే ప్రజల్లో భద్రతా భావం నెలకొంటుందని అన్నారు. ఇకపోతే సోనూ సూద్ చిరు చేస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :