యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు దసరా పండుగ కళ ఒకరోజు ముందునుంచే ‘నాన్నకు ప్రేమతో’ టీజర్‌తో మొదలైంది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తోన్న స్టైలిష్ రివెంజ్ డ్రామా ‘నాన్నకు ప్రేమతో’ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులే కాక, సినీ పరిశ్రమ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్, స్టిల్స్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేయగా, కొద్దిసేపటి క్రితం దసరా కానుకగా విడుదలైన టీజర్ కేక పుట్టిస్తోంది.
30 సెకండ్ల నిడివి గల ఈ టీజర్లో ఎన్టీఆర్, గతంలో ఏ సినిమాలోనూ కనిపించనంత స్టైలిష్‌గా, సరికొత్త లుక్‌తో విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. సుకుమార్ మార్క్ స్టైలిష్ మేకింగ్ ఈ టీజర్లో స్పష్టంగా కనబడుతోంది. లండన్ నగర వీధుల్లో ఎన్టీఆర్ స్టైలిష్‌గా డ్యాన్స్ మూవ్స్ చేస్తూ రూపొందిన సన్నివేశాలకు సంబంధించి ఈ టీజర్లో చూపించిన కట్స్ అభిమానులకు కనులవిందనే చెప్పాలి. ఇక ఐ వానా ఫాలో ఫాలో ఫాలో.. అంటూ దేవిశ్రీ ప్రసాద్ పాట ఈ టీజర్‌కు స్పెషల్ హైలైట్‌గా నిలిచే అంశమని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఈ టీజర్‌తో నాన్నకు ప్రేమతో సినిమా సరికొత్త అంచనాలతో మరింత క్రేజీ ప్రాజెక్టుగా మారిపోయిందని చెప్పొచ్చు. టీజర్ చివర్లో గోడను తాకుతూ ఎన్టీఆర్ చేసిన చిన్న డ్యాన్స్ మూవ్ షాట్ టీజర్‌కే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి నెలలో విడుదల కానుంది.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


