రూ. 150 కోట్ల మార్కును అందుకున్న ‘స్పైడర్’ !


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజే మిక్స్డ్ టాక్ తో మొదలైంది. దీంతో ఓపెనింగ్స్ దగ్గర్నుంచి రోజువారీ కలెక్షన్ల వరకు ఆశించిన స్థాయిలో రాలేదు. పైగా చాలా చోట్ల భారీ ధరలకు హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఇంకా అసలు వెనక్కు రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా 12 రోజులకుగాను ప్రపంచవ్యాప్తంగా చిత్ర కలెక్షన్లు రూ.150 కోట్ల గ్రాస్ ను తాకినట్టు నిర్మాతలు ప్రకటించారు.

అంతేగాక విజయానికి కారణమైన అభిమానులకు సైతం కృతజ్ఞతలు తెలిపారు. మిక్స్డ్ టాక్ తో కూడా ఈ స్థాయి వసూళ్లు దక్కాయంటే అందుకు కారణం మహేష్, మురుగదాస్ ల స్టార్ డమ్ అనే చెప్పాలి. ఇకపోతే ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హారిశ్ జైరాజ్ సంగీతాన్ని అందివ్వగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అంతేగాక ఇందులో ప్రతినాయకుడిగా నటించిన ఎస్.జె. సూర్య కు ఈచిత్రం తర్వాత అనేక కొత్త ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి.