హరికృష్ణను హీరోగా పరిచయం చేస్తూ.. నూతన చిత్రం !

Published on Jul 30, 2019 3:00 am IST

శ్రీ మోనికా స్రవంతి ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌పై హరికృష్ణ, ఫిదాగిల్‌, అనూ హీరో హీరోయిన్లుగా ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 జూలై 29న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రఘు పతకమూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మురళి శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో హరికృష్ణ, హీరోయిన్‌ అనూపై చిత్రీకరించిన ముహూర్త సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి క్లాప్‌నివ్వగా, దర్శకుడు డైమండ్‌ రత్నబాబు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. పాటల రచయిత భాస్కరభట్ల స్క్రిప్ట్‌ను దర్శకుడు రఘు పతకమూరికి అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. ఫస్ట్‌ షాట్‌కు క్లాప్‌నిచ్చిన దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ – ”కొత్త హీరోలకి, కొత్త దర్శకులకి ఇది మంచి సీజన్‌. కొత్త దర్శకులు మంచి కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చి సక్సెస్‌లు అందుకుంటున్నారు. అలాగే కొత్త హీరోలు కూడా వాళ్ళ స్టామినా చూపించి ఆడియన్స్‌ని వారి వైపు తిప్పుకుంటున్నారు. ఈ తరుణంలో వస్తోన్న ఈ సినిమా కూడా మంచి సక్సెస్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”అన్నారు.

నిర్మాత మురళి శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ”ఈ రోజు మా మోనికా స్రవంతి ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో మా అబ్బాయి హరిని హీరోగా పరిచయం చేస్తూ నూతన చిత్రం ప్రారంభించాం. క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు రఘు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ప్రేక్షకులకి నచ్చే అన్ని అంశాలతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కి మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు”అన్నారు.

సంబంధిత సమాచారం :