‘కుమారి 21 ఎఫ్’ కోసం సుకుమార్ స్పెషల్ ప్రమోషన్స్!

sukumar2
‘కుమారి 21 ఎఫ్’.. గత కొద్దికాలం వరకూ ఎవ్వరికీ పెద్దగా పరిచయం కూడా లేని ఈ సినిమా, ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ సినిమాగా మారిపోయింది. విలక్షణ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ అన్న బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమా ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోల ప్రమోషన్‌తో ఇప్పటికే విపరీతమైన ఆసక్తి రేకెత్తించగా, ఈమధ్యే విడుదలైన ఆడియో, ట్రైలర్‌‌లతో ఎక్కడికో వెళ్ళిపోయింది. దీంతో ఈ సినిమాకు బిజినెస్ పరంగానూ క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. దిల్‌రాజు, సాయి కొర్రపాటి లాంటి ప్రముఖ నిర్మాతలు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేయడం ఈ సినిమాకు మరింతగా కలిసివచ్చింది.

నవంబర్ 20న పెద్ద ఎత్తున ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సినిమా రిలీజ్‌కు ఇంకా కేవలం పదిరోజులే ఉండడంతో కుమారి 21 ఎఫ్ టీమ్ సరికొత్త ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. సుకుమార్ స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే డబ్‌స్మాష్ పేరుతో పలువురు టాప్ హీరోయిన్స్ ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయగా, తాజాగా సుకుమార్ మరిన్ని వినూత్న ఆలోచనలతో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అంతటా క్రేజీగా నిలిచిన ఈ సినిమా యూత్‌కి కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తోండడం కూడా సుకుమార్‍కు బాగా కలిసివచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. రాజ్ తరుణ్, హీబా పాటిల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు.

Exit mobile version