ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – హార‌ర్‌, కామెడీతో పాటు ఎమోష‌న్ కూడా హైలెటే !

Published on Jul 8, 2019 7:45 pm IST

సందీప్ కిషన్ హీరోగా అన్య సింగ్ హీరోయిన్ గా రాబోతున్న చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే’. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాల పై ఈ సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. కాగా ఈ సినిమా జూలై 12న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ తో ఇంటర్వ్యూ…

 

ఈ సినిమా డిఫ‌రెంట్ పాయింట్‌ తో ఎమోష‌న‌ల్ హార‌ర్ గా వస్తోందంటున్నారు ? అసలు సినిమా కథేంటి?

మీరు ఈ సినిమా ట్రైలర్ పరీక్షగా చూస్తే మీకు కథ అర్ధమవుతుంది. ట్రైలర్ లోనే సినిమా కథతో పాటు స్క్రీన్‌ప్లే చెప్పేశాం. అన్ని సినిమాల్లో లానే ఓ అబ్బాయి ప్రేమలో పడతాడు. అయితే తన ల‌వ‌ర్‌ తో కారులో వెళ్తుండ‌గా అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ దగ్గర నుంచి అద్దంలో చూసుకుంటే తన బదులు మరొకరు కనిపిస్తారు. ఎందుకలా కనిపిస్తున్నారు ? అసలు ఏం జరిగింది ? అనేది మిగతా కథ.

 

ఇంతకీ అద్దంలో చూసుకునప్పుడు కనిపించే మరొకరు ఎవరు ?

‘వెన్నెల’ కిషోర్. తన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. బాగా నవ్విస్తాడు. అయితే అసలు తను నన్ను ఎందుకు వీడటం లేదనేది కథ. ఇప్పటికే నేను సినిమా చూశాను. మంచి సినిమా చేశాననే సంతృప్తి వచ్చింది.

 

ఇప్పటికే చాలా హారర్ కామెడీ చిత్రాలు వచ్చాయి, వాటికి భిన్నంగా మీ చిత్రంలో ఉన్న విశేషం ఏమిటీ ?

హారర్ అనేది యూనివర్సల్ జానర్ కదా. ఎన్ని సినిమాలు వచ్చినా సినిమా బాగుంటే చూస్తారు. ఇక మా సినిమాలో మంచి కామెడీ ఉంటుంది. అయితే కామెడీ కోసం ఎక్కడా కావాలని కామెడీ ఇరికించలేదు. సినిమాలో వెన్నెల కిషోర్ తో పాటు పోసాని కృష్ణమురళిగారు కూడా ఇరగదీశాడు. అలాగే సినిమాలో హారర్, కామెడీ కంటే కూడా ఎమోషన్ చాలా బాగుటుంది.

 

మొదటసారి నిర్మాణ బాధ్యతలను చూసుకున్నారనుకుంటా… ఎందుకు ?

గత రెండు సంవత్సరాల నుంచీ నా సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఆ సినిమాల విషయంలో ఎక్కడ తప్పు జరిగిందో విడుదలకు ముందే అర్ధమైంది. రిలీజ్ తర్వాత ఆడియన్స్ సేమ్ అవే తప్పులు చెప్పారు. ఒకవేళ ఆ తప్పులు విడుదలకు ముందే సరిచేసుకుని ఉంటే.. ఫలితం వేరేలా వచ్చేదేమో. అందుకే.. ఆ క్రమంలో నిర్మాతగా మారాను. ఈ సినిమా నేను నమ్మిన విధంగా తీయాలనుకుని ఖర్చు పెట్టాం.

 

నిర్మాతగానా ? నటుడిగానా ? మీకు ఏది కష్టమనిపించింది ?

నటించడం అలవాటే కాబట్టి అది పెద్దగా కష్టంగా ఫీల్ అవ్వను. అయితే నటుడిగా రెండొందల శాతం కష్టపడతా. ఇక నిర్మాతగానే ఎక్కువ కష్టం. చాలా టెన్సన్స్ హ్యాండిల్ చెయ్యాలి. అయితే ఈ ప్రయాణంలో నా స్నేహితుడు, ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన దయా పన్నెం చాల సపోర్ట్ చేసాడు. అలాగే, ‘జెమిని’ కిరణ్ గారు, అనిల్ సుంకరగారు కూడా చాలా హెల్ప్ చేశారు.

 

మీ తదుపరి సినిమాలు ఏమిటి ?

ప్రస్తుతం ‘తెనాలి రామకృష్ణ’ చేస్తున్నాను. ఆ సినిమాని మరో మూడు నెలల్లో విడుదల చేస్తాం. అలాగే ‘ది ఫ్యామిలీ మాన్’ అని హిందీ వెబ్ సిరీస్‌లో న‌టించాను. ఇక త్వరలో మరో సినిమా మొదలు కాబోతుంది.

సంబంధిత సమాచారం :

X
More