ఇంటర్వ్యూ : తాప్సీ – పిల్లలు ఎప్పుడైతే కావాలనిపిస్తోందో అప్పుడు పెళ్లి చేసుకుంటా !

ఇంటర్వ్యూ : తాప్సీ – పిల్లలు ఎప్పుడైతే కావాలనిపిస్తోందో అప్పుడు పెళ్లి చేసుకుంటా !

Published on Jun 10, 2019 4:28 PM IST

‘ఆనందో బ్రహ్మ’ తర్వాత తాప్సీ దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె దక్షిణాదిన ద్విభాషా చిత్రాన్ని చేశారు. అదే ‘గేమ్ ఓవర్’. వీడియో గేమ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేశాడు. కాగా ఈ చిత్రం జూన్ 14న విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా తాప్సీ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

 

ముందుగా, ‘గేమ్ ఓవర్’ ఎలా మొదలైందో చెప్పండి ?

 

దాదాపు రెండు సంవత్సరాల క్రితం అశ్విన్ శరవణన్ ఈ సినిమా కథ చెప్పారు. నాకు చాల బాగా నచ్చింది. తెలుగు తమిళంలో ఈ సినిమా తియ్యాలనుకున్నట్లు చెప్పరు. అప్పటికే నేను తమిళంలో నటించే చాలా సంవత్సరాలు అయిపొయింది. ఈ సినిమాతో మళ్లీ తమిళంలో రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందనిపించింది. ఆలాగే తెలుగులో ఇలాంటి సినిమా చేస్తే ఆదరిస్తారని నమ్మకం ఉంది.

 

సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

 

ఈ సినిమాలో నేను చేసిన పాత్ర, నా జీవితంలో నాకు ఎప్పటికి గుర్తిండిపోతుంది. సినిమాలో 60 శాతం వరకూ నేను వీల్ చైర్ లోనే ఉంటాను. ఎంతో ప్రాక్టీస్ చేసి ఈ రోల్ లో నటించాను. మీ అందరికీ నచ్చుతుంది.

 

దర్శకుడు అశ్విన్ శరవణన్ గురించి చెప్పండి ?

 

అశ్విన్ శరవణన్ నాకు కథ చెప్పిన విధానమే సినిమా పై ఆయనకున్న విజన్ నాకు అర్ధం అయింది. ఆయన తీసిన మాయ” ‘మయూరి’ చిత్రాలు కూడా నాకు చాల బాగా నచ్చాయి. తన డైరెక్షన్ లో నటించినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది.

 

హిందీలో ఈ సినిమాని అనురాగ్ కశ్యప్ విడుదల చేయనున్నారు. ఆయన సినిమాను చూసారా ?

 

చూసిన తరువాతే ఆయన సినిమాను విడుదల చేస్తున్నారు. ఆయనకు సినిమా చాలా బాగా నచ్చింది. ఆయన వల్లే హిందీలో కూడా సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

 

మీరు ఎక్కువుగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తున్నారు. ఎందుకు గ్లామర్ రోల్స్ చేయడం లేదు ?

 

నిజం చెప్పాలంటే.. బాలీవుడ్ వాళ్ళు నాకు గ్లామర్ రోల్స్ ఇవ్వడం లేదు. నేను కూడా గ్లామర్ హీరోయిన్ లా లిప్ కిస్సులు పెడతాను, డాన్స్ చేస్తానన్నా.. ఏ డైరెక్టర్ నన్ను ఆ యాంగిల్ లో చూడడం లేదనుకుంటా. అయితే నేను ఇప్పటికే తెలుగు తమిళ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేశాను. భవిష్యత్తులో హిందీలో కూడా చేస్తానేమో చూడాలి.

 

హిందీ సినిమాల కోసం సౌత్ సినిమాలకు దూరం అయ్యారు. అయినప్పటికీ హిందీలో ఎక్కువ సినిమాలు ఎందుకు చెయ్యలేకపోతున్నారు ?

 

ఒకే సమయంలో వివిధ భాషల్లో వివిధ సినిమాల్లో నటించడం అన్ని సందర్భాల్లో కుదరదు. అందుకే నేను కొన్ని సౌత్ సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. అయితే బాలీవుడ్ నుంచి కూడా నాకేం ఎక్కువ అవకాశాలు రావట్లేదు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను.

 

పోనీ గ్యాప్ వచ్చిన సమయంలోనైనా సౌత్ లో సినిమాలు చెయ్యొచ్చు కదా ?

 

ప్రస్తుతం సౌత్ లో కూడా నాకు అవకాశాలు తగ్గాయి. తక్కువ మంది డైరెక్టర్స్ మాత్రమే నన్ను సంప్రదిస్తున్నారు. అయితే నా దగ్గరికి వస్తోన్న కథలు మాత్రం చాలా బాగుంటున్నాయి. అందుకే నేను ఆ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను.

 

హిందీ తెలుగు తమిళ్ ఇలా మూడు భాషల్లో నటిస్తున్నారు. ఎలా అనిపిస్తోంది ?

 

ఈ విషయంలో నేను చాల లక్కీ. నాకు వచ్చిన అవకాశాలే.. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి.

 

మీరు నిర్మాతగా మారుతున్నారని గతంలో వార్తలు వచ్చాయి ?

 

అవును, నాక్కూడా నిర్మాతగా మారాలని ఉంది. కాకపోతే నిర్మాణం అనేది ఎంతో రిస్క్ తో కూడుకున్నది. అందుకే మంచి పార్టనర్ కోసం చూస్తున్నాను. మంచి టీమ్ సెట్ అయితే మాత్రం ఖచ్చితంగా నిర్మాతగా మారతాను. ప్రస్తుతానికైతే నా దృష్టి మొత్తం నటనపైనే ఉంది.

 

తాప్సీ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతుంది ?

 

ఇప్పుడు అయితే నాకు పెళ్లి ఆలోచన లేదు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నా విషయానికి వస్తే.. నాకు ఎప్పుడైతే పిల్లలు కావాలనే అనిపిస్తోందో అప్పుడు పెళ్లి చేసుకుంటాను.

 

మీ తదుపరి చిత్రాలు గురించి చెప్పండి ?

 

తమిళంలో ఒక సినిమాకి సైన్ చేశాను. అలాగే తెలుగులో కూడా ఒక ఫిల్మ్ ఉంది. హిందీలో ప్రస్తుతం రెండు సినిమాలు జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు