వివాదానికి కారణమైన స్టార్ హీరో సినిమా షూటింగ్ !

20th, March 2018 - 02:47:50 PM

తమిళ చిత్ర పరిశ్రమ గత నాలుగు రోజులుగా షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ పనులు అన్నింటినీ ఆపివేసి డిజిటల్ ప్రొవైడర్ల చార్జీలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాతలు మండలి ప్రకటన ప్రకారం చాలా మంది నిర్మాతలు, హీరోలు, దర్శకులు తమ సినిమాల చిత్రీకరణను ఆపివేయగా స్టార్ హీరో విజయ్ యొక్క 62వ సినిమా షూటింగ్ మాత్రం చెన్నైలో నడుస్తోంది. దీంతో ఇతర నిర్మాతల నుండి వ్యతిరేకత తెలెత్తింది.

దీనిపై స్పందించిన నిర్మాతల మండలి సెక్రటరీ దురైరాజ్ మాట్లాడుతూ బంద్ ను అనౌన్స్ చేయగానే విజయ్ సినిమాను నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ నుండి తమకు లెటర్ అందిందని, అందులో ముందుగా డేట్స్ తీసుకున్న ఫైట్ మాస్టర్స్ ఇంకో రెండు నెలల వరకు అందుబాటులో ఉండరని, కాబట్టి తమకు నష్టం వాటిల్లకుండా చిత్రీకరణకు అనుమతివ్వాలని కోరారని, వారి వినతిని అన్ని విధాలా పరిశీలించి అనుమతులు ఇచ్చామని, ఇందులో పక్షపాత ధోరణి లేదని, ఇంకో మూడు సినిమాల నిర్మాతలు కూడ ముందుగా అనుమతులు అడగడవంతో రెండు రోజుల పాటు చిత్రీకరణకు ఒప్పుకున్నామని క్లారిటీ ఇచ్చారు.

కానీ ప్రముఖ నటుడు శరత్ కుమార్ ఈ వివరణపై స్పందిస్తూ నిరసనను అనౌన్స్ చేయగానే తామంతా నష్టం వస్తుందని తెలిసినా షూటింగ్స్ రద్దు చేసుకున్నామని, ఇలా కొందరికే చిత్రీకరణకు అనుమతులివ్వడం సరికాదని, తమకు మాత్రం బడ్జెట్ సమస్యలు ఉండవా అని ప్రశ్నించారు.