‘కిక్ 2’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తి చేసిన థమన్!

s-s-Thaman
‘కిక్ 2’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఓ స్పష్టత రాలేదు. మాస్ మహారాజ్ రవితేజ కెరీర్‌లో మరిచిపోలేని సినిమాగా నిలిచిన ‘కిక్’‌కు సీక్వెల్‌గా ‘కిక్ 2’ రూపొందిన విషయం తెలిసిందే! ‘కిక్’ సినిమాకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డియే ఈ సినిమాకూ దర్శకత్వం వహించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా మొదట మే 7నే విడుదల కానుందని ప్రకటించినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. ఇక అప్పట్నుంచీ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి మాత్రం కాస్త లేటయినా మంచి ఔట్‌పుట్‌తోనే రావాలనే ఆలోచనలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వహిస్తున్నారట.

థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలవగా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఆకట్టుకునేలా ఉండనుందని సమాచారం. నిన్ననే థమన్ ‘కిక్ 2’ సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ జరుగుతోంది. జూలై చివర్లో కిక్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Exit mobile version