లక్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న నూతన చిత్రం ‘ఆకర్షిత’. త్రిగుణ్, పదినే కుమార్ జంటగా నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు శనివారం ఘనంగా జరిగాయి. కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు సూరిశెట్టి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ కొట్టగా, జ్యోతిష్య నిపుణులు వేణుస్వామి చిత్రయూనిట్‌కు స్క్రిప్ట్ అందజేశారు. నటి ప్రియ చిత్ర టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. కొత్త దర్శకుడు కిషోర్ అద్భుతమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, ఇందులో కసిరెడ్డి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కథ విన్నప్పుడే ఆశ్చర్యపోయానని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందని నటుడు కసిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో సత్యం రాజేష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అదుర్స్ రఘు, రవివర్మ, ప్రియా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌లో పలు చిత్రాలకు పనిచేసిన షేక్ హజరత్ (వలి) ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.


