ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా రాజకీయ కారణాల వల్లే వార్తల్లో నిలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, అక్కడి రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి తరుణంలో, త్రిష నటించిన ఒక తమిళ చిత్రం ఏకంగా 12 ఏళ్ల తర్వాత విడుదలకు సిద్ధం కావడం విశేషం.
అరవింద్‌స్వామి, త్రిష జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘శతురంగ వట్టై-2’ 2014లోనే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆర్‌వీ నిర్మల్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హెచ్ వినోద్ కథను అందించాడు. అయితే, అప్పట్లో తలెత్తిన కొన్ని తీవ్రమైన ఆర్థిక సమస్యల కారణంగా ఈ సినిమా విడుదల కాకుండా నిలిచిపోయింది. త్రిష సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రోజుల్లో చేసిన సినిమా కావడంతో, దీనిపై అభిమానుల్లో ఇప్పటికీ ఆసక్తి ఉంది.
ప్రస్తుతం తమిళనాట త్రిషకు ఉన్న విపరీతమైన క్రేజ్ మరియు ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ తరుణంలో సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తే కమర్షియల్‌గా మంచి వర్కవుట్ అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా అధికారిక రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.


