సమీక్ష : తుపాకి రాముడు – నవ్వు రాని సిల్లీ కామెడీ !

Published on Oct 26, 2019 3:01 am IST

విడుదల తేదీ : అక్టోబర్ 25, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : బిత్తిరి సత్తి, ప్రియ, రసమయి బాలకిషన్ తదితరులు.
దర్శకత్వం :  టి ప్రభాకర్

నిర్మాత‌లు : రసమయి బాలకిషన్

సంగీతం : టి ప్రభాకర్

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రసమయి ఫిల్మ్స్ బ్యానర్ పై టి ప్రభాకర్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘తుపాకి రాముడు’. ప్రియ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :
తుపాకి రాముడు (బిత్తిరి సత్తి) చదువు ఆస్తితో పాటు మతం కులం లేని ఓ అనాధ. అందరూ అవమానిస్తున్నా.. వారికి మంచి చేసే ఓ మంచి మనిషి. అతని చేసిన మంచి పనులు వల్ల గ్రామంలో చాలమంది మనసులను గెలుచుకుంటాడు. దాంతో ఆ గ్రామం వాళ్లే మూడు ఎకరాల భూమి ఇచ్చి రాముడుకి పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. ఆ క్రమంలో పెళ్లి చూపులకు వెళ్లిన రాముడుకి అక్కడి పెళ్లి కూతురు.. చదువుకోని వస్తే పెళ్లి చేసుకుంటా అని కండిషన్ పెడుతుంది. దాంతో రాముడు అనిత (ప్రియ) దగ్గర చదువు నేర్చుకుంటాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రాముడు – అనిత ఒకరంటే ఒకరు ఇష్టపడతారు? వారి ఇష్టానికి వారి పెళ్లికి అడ్డు వచ్చిన అంశం ఏమిటి? చివరికీ రాముడు అనిత పెళ్లి చేసుకుంటారా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన బిత్తిరి సత్తి ఎలాంటి తడబాటు, బెఱుకు లేకుండా చాలా చక్కగా కాన్ఫిడెంట్ గా నటించారు. పక్కా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో సత్తి పక్కా మాస్ హీరో రేంజ్‌లో రెచ్చిపోయాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా సత్తి బాగా నటించారు. హీరోయిన్ గా నటించిన ప్రియ కూడా తన నటనతో ఆకట్టుకుంది. తన స్క్రీన్ ప్రేజిన్స్ తో ప్రియ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక హీరోయిన్ అన్నయ్యగా నటించిన నటుడు తక్కువ సీన్స్ లోనే కనిపించనప్పటికీ.. చాలా ముఖ్యమైన పాత్రను పోషించారు. బాగా నటించాడు. సత్తి పక్కన ఫ్రెండ్స్ గా నటించిన నటులు కూడా తమ కామెడీ టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. దర్శకుడు మంచి మెసేజ్ చెబుతూనే ఎక్కువుగా వీలైనంత వరకు నవ్వించాడనికే ప్రయత్నం చేశారు.

 

మైనస్ పాయింట్స్:

దర్శకుడు సినిమా ముగింపులో కులం అనే అంశం పై చెప్పించే నాలుగు రొటీన్ నీతి డైలాగ్ లు కోసం ఈ సినిమా తీసాడా అనిపిస్తోంది. అసలు సినిమాలో చెప్పుకోవడానికి మెయిన్ పాయింట్‌ అంటూ ఏం ఉండదు. దర్శకుడు తనకు తోచినట్లు రాసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం సంబంధం లేని సీన్లతో నవ్వు రాని కామెడీతో సాగితే, సెకెండ్ హాఫ్ సాగతీత సన్నివేశాలతో సాగుతుంది.

సినిమా మొదలైన పది నిముషాలకే ఈ సినిమా ఏ స్థాయి సినిమానే అర్థమయిపోతుంది. కాలం చెల్లిన సీన్స్ తో నవ్వించడానికి శతవిధాలా ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా నాలుగు సార్లు కూడా నవ్వుకోరు. అయినా సత్తి టీవీలోనే ఇంతకన్నా బాగా నవ్విస్తున్నాడు. దర్శకుడు అనవసరమైన సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేశారు. అవసరానికి మించిన పండని హాస్య సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి.

దీనికి తోడు దర్శకుడు ఉన్న కంటెంట్ ను కూడా పూర్తిగా వాడుకోలేదు. ఆయన కథ కథనాన్ని ఆసక్తికరంగా మలచకపోగా.. హీరోయిన్ ట్రాక్ కి సంబంధించి బలంగా ఉన్న ఎమోషనల్ కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు టి ప్రభాకర్ పేపర్ మీద రాసిన స్క్రిప్ట్ ను స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. పైగా ఆయన రాసుకున్న కథకథనాల్లో సహజత్వంతో పాటు ఆకట్టుకునే విషయం కూడా లేదు. కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది. ఇక పాటల్లో ఒక పాట ఆకట్టుకుంటుంది. కానీ నేపధ్య సంగీతం మాత్రం సినిమాకి తగ్గట్లు సాగదు. ఎడిటర్ దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. కథకు తగ్గట్లుగానే ఈ చిత్ర నిర్మాత రసమయి బాలకిషన్ నిర్మాణ విలువలు ఉన్నాయి.

 

తీర్పు :

టి ప్రభాకర్ దర్శకత్వంలో బిత్తిరి సత్తి – ప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఆకట్టుకోదు. కానీ బిత్తరి సత్తి కామెడీ టైమింగ్ మరియు అక్కడక్కడా కొన్నిచోట్ల పండే కామెడీ సీన్స్ ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. అలాగే కులం పిచ్చితో మనుషులను చంపే నీచమైన పద్దతిని సినిమాలో ఎలివేట్ చేసిన విధానం కూడా ఎమోషనల్ గా పర్వాలేదనిపిస్తోంది. కాకపొతే సినిమాల్ని రెగ్యూలర్ గా చూసే ప్రేక్షకులకి ఈ చిత్రం రుచించదు. కనీసం సత్తి కామెడీనైనా ఎంజాయ్ చేద్దామనుకుంటే అది కూడా తేలిపోయింది. ఓవరాల్ గా సినిమాలోని చాలా సన్నివేశాలు ఇంట్రస్ట్ గా సాగకపోగా మరీ నాటకీయంగా ఉండటంతో ఈ సినిమా నిరాశ పరుస్తోంది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Review

సంబంధిత సమాచారం :

More