వైరల్ వీడియో: ఉత్తరాఖండ్‌లో ప్రకృతి బీభత్సం.. క్షణాల్లో కుప్పకూలిన వంతెన

వైరల్ వీడియో: ఉత్తరాఖండ్‌లో ప్రకృతి బీభత్సం.. క్షణాల్లో కుప్పకూలిన వంతెన

Published on Aug 10, 2026 9:43 PM IST

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో కొండ ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. తాజాగా చమోలీ జిల్లాలోని నితి వ్యాలీ ప్రాంతంలో కొండల నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి ఒక వంతెన కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కుండపోత వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. బురద, రాళ్లతో కూడిన వరద నీరు అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టడంతో లోహంతో నిర్మించిన ఆ వంతెన క్షణాల వ్యవధిలోనే కుప్పకూలి నదిలో కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగే సమయంలో సమీపంలోని రహదారిపై వాహనాల రాకపోకలు సాగుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వంతెన ధ్వంసం కావడంతో నితి వ్యాలీ ప్రాంతానికి ప్రధాన పట్టణాలతో అనుసంధానం తెగిపోయింది. ముందస్తు జాగ్రత్త చర్యగా అటువైపు వెళ్లే వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు ఆ ప్రాంతానికి ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు.

మరోవైపు డెహ్రాడూన్, నైనిటాల్, చంపావత్ తదితర ప్రాంతాల్లోనూ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉందని, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ వెల్లడించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున కొండ ప్రాంత నివాసితులు, పర్యాటకులు నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

తాజా వార్తలు