
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం తన రెండవ సినిమా ‘కంచె’ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 27న లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్ లో భాగంగా రామానాయుడు స్టూడియోస్ లో వేసిన ఓ భారీ హౌస్ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగానే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ సోమవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని తాటిపాక పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు.
ఈ షెడ్యూల్ లో వరుణ్ తేజ్ తో పాటు హీరోయిన్ ప్రాగ్య జైశ్వాల్ కూడా షూటింగ్ లో పాల్గొంటోంది. వరుణ్ తేజ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో ఒక ఎపిసోడ్ స్వాతంత్ర్యం రాకముందు ఉంటుంది. ఇదొక ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమాకి సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఈ చిత్ర టీం ఉంది. వరుణ్ తేజ్ ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నాడు.

