‘బెంగళూర్ డేస్’ రీమేక్‌పై క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్

‘బెంగళూర్ డేస్’ రీమేక్‌పై క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్

Published on Oct 21, 2015 7:00 PM IST

varun-tej
మెగా ఫ్యామిలీ నుంచి ‘ముకుందా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ తేజ్, తాజాగా కంచె సినిమాతో మెప్పించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ సినిమా దసరా కానుకగా రేపు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ కంచె సినిమా విశేషాలను తెలియజేస్తూ అభిమానులతో ట్విట్టర్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా వరుణ్ అభిమానులడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. పూరీ జగన్నాథ్‌తో చేస్తోన్న లోఫర్ సినిమా తర్వాత తన కొత్త సినిమా ఏంటనేది ఇంకా నిర్ణయించుకోలేదని వరుణ్ ఈ సందర్భంగా తెలిపారు.

ఇక గత కొద్దికాలంగా మళయాలంలో ఘన విజయం సాధించిన ‘బెంగళూర్ డేస్’ తెలుగు రీమేక్‌లో వరుణ్ ఓ హీరోగా నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ విషయం గురించి మాట్లాడుతూ బెంగళూర్ డేస్ తెలుగు రీమేక్‌లో తాను నటించడం లేదని స్పష్టం చేశారు. బెంగళూర్ డేస్ తమిళ రీమేక్ ఇప్పటికే చివరి దశకు చేరుకోగా, తెలుగు రీమేక్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బెంగళూర్ డేస్ తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. శర్వానంద్, వరుణ్ తేజ్, అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్స్ చేస్తారన్న ప్రచారం ఇప్పటివరకూ జరుగుతూ ఉండగా వరుణ్ తేజ్ ఈ ప్రాజెక్టులో లేనని స్పష్టం చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి బెంగళూర్ డేస్ తెలుగు రీమేక్‌లో ఎవరెవరు నటిస్తారు? సినిమా సెట్స్‌పైకి వెళ్ళేదెప్పుడు అన్నది తెలియాలంటే వేచిచూడాల్సిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు