రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 1990ల కాలంలో పాకిస్థాన్‌లోని కరాచీ (లయరీ) వేదికగా జరిగిన గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, ఇప్పటికే సుమారు రూ. 1000 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రం, మన దేశ ఏజెంట్ పాక్ గ్యాంగ్‌లను ఎలా మట్టుబెట్టాడనే ఆసక్తికరమైన కథాంశంతో సాగుతుంది.
అయితే, ఈ సినిమా సాధిస్తున్న భారీ వసూళ్లలో తమకు కూడా వాటా ఇవ్వాలని లయరీ ప్రాంత ప్రజలు వింత డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని సినిమాలో చూపించి డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి, ఆ కలెక్షన్లలో 50 నుంచి 80 శాతం వరకు తమకు ఇవ్వాలని, లేదా కనీసం తమ ఊరిలో ఒక ఆసుపత్రి అయినా కట్టించాలని కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వీడియోల ద్వారా కోరుతున్నారు. ఈ డిమాండ్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు, ఈ సినిమాను పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధించినప్పటికీ, అక్కడి జనం పైరసీ ద్వారా సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు 2 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్‌తో పాక్‌లోనూ ఈ మూవీ హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలోని పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లకు అక్కడి యువత రీల్స్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఒకవైపు సినిమాపై నిషేధం ఉన్నా, మరోవైపు తమ ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమా కాబట్టి వసూళ్లలో వాటా కావాలని అక్కడి వారు కోరడం చర్చనీయాంశమైంది.
