విడుదల తేదీ : జూన్ 19, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : విజయ్ ఆంటోనీ, స్వాసిక, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్
దర్శకత్వం : శశి
నిర్మాణం : మీరా విజయ్ ఆంటోనీ
సంగీతం : బాలాజీ శ్రీరామ్
ఛాయాగ్రహణం : విజి సతీష్
కూర్పు:హరీష్ యువరాజ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
’బిచ్చగాడు’ కాంబినేషన్ విజయ్ ఆంటోనీ, డైరెక్టర్ శశిల కలయికలో వచ్చిన తాజా చిత్రం ‘వంద దేవుళ్లు’. వీరి గత సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
వాసవి (స్వాసిక) ఇద్దరు కొడుకులను ఒంటరిగా పెంచే ఒక మధ్యవయస్కురాలైన తల్లి. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆమె, జీవితంలో ఒక దశలో మళ్లీ పెళ్లి చేసుకుని కొత్తగా బతకాలని అనుకుంటుంది. కానీ, సమాజానికి భయపడి ఆమె పెద్ద కొడుకు భాస్కర్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. కొన్నేళ్ల తర్వాత భాస్కర్‌కు తల్లి బాధ అర్థమై, ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తాడు. కానీ అప్పటికే వాసవికి ఆ ఆసక్తి పోతుంది. ఈ ఎమోషనల్ పాయింట్ చుట్టూనే కథ తిరుగుతుంది. మరి చివరికి వాసవి పెళ్లికి ఒప్పుకుందా? గ్రామస్థులు దీనిపై ఎలా స్పందించారు? ఈ కథలోకి ఏడుకొండలు (విజయ్ ఆంటోనీ) ఎలా ఎంట్రీ ఇచ్చాడు? అనేదే మిగతా సినిమా.
ప్లస్ పాయింట్స్ :
తల్లి పాత్రలో స్వాసిక అద్భుతమైన నటనను కనబరిచింది. తన నిజ వయసుకంటే పెద్ద పాత్ర అయినప్పటికీ, ఎంతో పరిణతితో, ఎమోషనల్ డెప్త్‌తో ఆ పాత్రకు ప్రాణం పోసింది. ఈ సినిమాకు ఆమే అతిపెద్ద బలం.
ఒక పల్లెటూరి తల్లి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథను రాయడం వల్ల సీన్లు చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి.
సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చే విజయ్ ఆంటోనీ సినిమాకు కొత్త ఎనర్జీని తెచ్చాడు. స్వాసిక, విజయ్ ఆంటోనీల మధ్య వచ్చే సీన్లు సినిమాకే హైలైట్. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లో గా సాగుతుంది. తల్లి, కొడుకుల మధ్య వచ్చే గొడవలే మళ్లీ మళ్లీ చూపించడం వల్ల కథనం ఒకే చోట ఆగిపోయినట్లు అనిపిస్తుంది.
కథలో మంచి ఎమోషనల్ స్కోప్ ఉన్నప్పటికీ, డైరెక్టర్ శశి దాన్ని మరింత బలంగా చూపించలేకపోయారు. కొన్ని ముఖ్యమైన సీన్లను పైపైన వదిలేశారు.
ఫస్టాఫ్‌తో పాటు సెకండ్ హాఫ్‌లోనూ కొన్ని సీన్లు సాగదీసినట్లు ఉంటాయి. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది. సీరియస్ ఎమోషనల్ డ్రామా నడుస్తున్నప్పుడు మధ్యలో వచ్చే కామెడీ ట్రాక్ మెప్పించదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు శశి మానవ సంబంధాలను ఎప్పుడూ సహజంగా చూపిస్తారు. ఇందులోనూ ఆ ప్రయత్నం కనిపించింది. అయితే ఫస్టాఫ్‌ను ఇంకాస్త గ్రిప్పింగ్‌గా రాసుకోవాల్సింది. దర్శన్ కిర్లోష్ కెమెరా వర్క్ వల్ల పల్లెటూరి వాతావరణం చాలా నాచురల్‌గా అనిపిస్తుంది. హరీష్ యువరాజ్ ఎడిటింగ్ యావరేజ్. బాలాజీ శ్రీరామ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. భాష్యశ్రీ రాసిన తెలుగు డైలాగ్స్ ఎమోషనల్ సీన్లలో బాగా పేలాయి.
తీర్పు :
మొత్తంగా చుస్తే.. ‘వంద దేవుళ్లు’ చిత్రం బలమైన ఎమోషనల్ లైన్ మరియు స్వాసిక అద్భుతమైన నటన వల్ల కొంతవరకు మెప్పిస్తుంది. విజయ్ ఆంటోనీ తన పాత్రతో సెకండ్ హాఫ్‌ను నిలబెట్టాడు. కానీ స్లోగా సాగే ఫస్టాఫ్, సాగదీత సీన్లు సినిమా రేంజ్‌ను తగ్గించేశాయి. ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వారిని ఈ సినిమా కొంతవరకు మెప్పిస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


