టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘వారణాసి’ని సిద్ధం చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన లేయర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే ఈ సినిమాలో మైథలాజికల్ టచ్ ఉండబోతోందని స్పష్టమైంది. ఈ చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఈ సినిమా కథాంశంపై ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
‘వారణాసి’ చిత్రం పూర్తిగా ‘శ్రీరాముడు వర్సెస్ కుంభకర్ణుడు’ నేపథ్యంలో సాగుతుందని, వారి మధ్య జరిగే పురాణ యుద్ధమే సినిమాకు ప్రధాన హైలైట్ అని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే ఈ సినిమా కథ విభిన్న కాలమానాల్లో సాగుతుందా అని అడిగిన ప్రశ్నకు మాత్రం.. తాను ఇప్పుడే అంతకంటే ఎక్కువ విషయాలు చెప్పలేనని దాటవేశారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభకర్ణుడి పాత్రలో కనిపించనున్నారు.
ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ను రాబోయే ఆగస్టు నాటికి పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


