తెలుగు, తమిళ, హిందీ సినిమా స్టార్ హీరోలు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించే అవకాశం ఎప్పుడు వస్తుందా..? అని ఎదురు చూస్తున్నారు. ఈ అగ్ర దర్శకుడు మాత్రం అజిత్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఎప్పుడొస్తుందా..? అని ఎదురు చూస్తున్నాడు. అజిత్ ‘దిన’ సినిమాతో ఏఆర్ మురుగదాస్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ‘సహాయ దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నన్ను దర్శకుడిని చేసింది అజిత్. నా కష్టాలను దూరం చేసి నాకో కొత్త జీవితాన్ని ఇచ్చారు. అలాంటి హీరోతో ఎప్పుడైనా సినిమా చెయ్యడానికి నేను సిద్దమే. కథ కూడ రెడీగా ఉంది. అని ఇటివల ఒక ఇంటర్వ్యూలో మురుగదాస్ చెప్పారు.
‘రమణ’ (తెలుగులో ‘ఠాగూర్’గా రీమేక్ చేశారు), ‘గజిని’, ‘తుపాకి’ సినిమాలతో మురుగదాస్ స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయారు. ‘కత్తి’ విజయంతో 3 ఇండస్ట్రీలలో మోస్ట్ వాంటెడ్ దర్శకుల జాబితాలో మురుగదాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
సోనాక్షి సిన్హా హీరోయిన్ గా హిందీలో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కించడానికి ఏఆర్ మురుగదాస్ సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్‌లో సెట్‌పైకి వెళ్లనుంది.


