బడ్జెట్ కంట్రోల్ చేయగలిగితే వండర్స్ క్రియేట్ చేయవచ్చు అని అంటున్నారు నిర్మాత రాక్ లైన్ వెంకటేష్. కన్నడలో 33 సినిమాలు నిర్మించారు. ఎన్నో విజయాలను అందుకున్నారు. బెంగుళూరులో సినిమా డిస్ట్రిబ్యూటర్ గా ఇంకెంతో అనుభవం గడించారు. తెలుగులో రవితేజ నటించిన ‘పవర్’ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ విశేషాలను తెలియజేయడానికి దర్శకనిర్మాతలు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం..
నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ.. ఎప్పటి నుండో ఒక తెలుగు సినిమా నిర్మించాలి అనుకుంటున్నాను. రవితేజ ద్వారా బాబీ పరిచయం అయ్యారు. అతను చెప్పిన కథ, నేరేషన్ నాకు బాగా నచ్చాయి. ‘పవర్’ సినిమా స్టార్ట్ చేశాం. ‘విక్రమార్కుడు’ తర్వాతన పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్న సినిమా ఇది. రవితేజ నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. రెండు విభిన్నమైన పాత్రలలో నటించారు. యాక్షన్ & కామెడీకి ఈక్వల్ ఇంపార్టెన్స్ సినిమాలో ఉంటుంది. సెప్టెంబర్ 12న సినిమాను విడుదల చేస్తున్నాం. తమన్ ఆడియోకి రెస్పాన్స్ బాగుంది. మంచి కమర్షియల్ సక్సెస్ సాదిస్తుందని ఆశిస్తున్నా అని అన్నారు.
కన్నడ సినిమా పరిశ్రమకు కొన్ని పరిమితులు ఉన్నాయి. బిజినెస్ పరంగా హై బడ్జెట్ సినిమాలు నిర్మించడం వీలు కాదు. తెలుగులో ఎంత బడ్జెట్ పెట్టి అయినా సినిమాలు నిర్మించవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీ కామధేనువు లాంటిది. మన పెట్టుబడి తిరిగివస్తుంది. కథ, స్క్రిప్ట్ డిమాండ్ మేరకు నేను ఖర్చు పెడతాను. అనవసరంగా ఒక్క రూపాయి కూడా వృధా చేయడం ఇష్టం ఉండదు. బడ్జెట్ కంట్రోల్ చేయగలిగితే నిర్మాతకు లాభాలు తీసుకువచ్చే సినిమాలు వస్తాయి. అద్బుతాలు(వండర్స్) క్రియేట్ చేయవచ్చు అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


