ఈమధ్య కాలంలో తెలుగులో మల్టీస్టారర్ల హవా ఎక్కువైంది. ఒకప్పటి ఈ క్రేజీ మల్టీస్టారర్లు కొన్నాళ్ళ వరకూ తగ్గిపోయాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మళ్ళీ ఊపందుకున్న ఈ ట్రెండ్.. ఆ తర్వాత వరుస సినిమాలతో కొనసాగుతోంది. తాజాగా ఈ మల్టీస్టారర్ జాబితాలోకి మరో భారీ సినిమా వచ్చిపడనుంది. వెంకటేష్, రానాల కలయికలో ఓ సినిమా రూపొందనున్న విషయం ఇంతకుముందే తెలియజేశాం. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మించనున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తాజాగా రానా వెల్లడించారు. ట్విట్టర్‌లో అభిమానులతో ఓ గంట పాటు చాట్ చేసిన రానా ఒక ప్రశ్నకు సమాధానంగా వెంకీ-రానాల సినిమా విషయమై ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమా పట్టాలెక్కనుందని రానా తెలిపారు. ప్రస్తుతం బాహుబలి షూటింగ్ పూర్తి చేసి బెంగళూర్ డేస్ షూటింగ్‌లో రానా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల కలయికలో ఇలా ఓ సినిమా రూపొందనుండడం విశేషమే. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


