ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టకముందు నుంచే ఆ చిత్రానికి సంబంధించి ఏదొక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. జులై 5న షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రంలో ఇంకా కొన్ని ముఖ్యమైన పాత్రల కోసం నటులను వెతికే పనిలో ఉన్నారు. అందులో ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావుగారి పాత్ర, హరికృష్ణ పాత్ర ఇలా కొన్ని పాత్రలకు నటులను ఫైనల్ చేయాల్సి ఉంది.
కాగా నాగేశ్వరరావుగారి పాత్రను ఆయన పెద్ద మనవడు హీరో సుమంత్ పోషించనున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. ఐతే ఇంకా చిత్రబృందం సుమంత్ ను సంప్రదించలేదని తెలుస్తోంది. అలాగే హరికృష్ణ పాత్రలో ఆయన తనయుడు కళ్యాణ్ రామ్ కనిపించనున్నారని వార్తలు వచ్చినా అది కూడా నిజం కాదట. ప్రస్తుతం ఈ చిత్రం మొదటి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది.
తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మొదటి షెడ్యూల్ కి తర్వాత షెడ్యూల్ చాలా గ్యాప్ తీసుకోనుంది చిత్రబృందం. ఆ గ్యాప్ లో మిగిలిన పాత్రలకు ఆయా నటీనటులును సంప్రదించి అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా బాలకృష్ణే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


