హీరో శర్వానంద్ (Sharwanand) ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘సామజవరగమనా’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జనవరి 14న సాయంత్రం 5:49 నిమిషాలకు థియేటర్లలో విడుదల కానుంది.
సంక్రాంతి సీజన్ శర్వానంద్‌కు ఎప్పుడూ కలిసొచ్చిన విషయం తెలిసిందే. ఎక్స్‌ప్రెస్ రాజా సూపర్ హిట్ కాగా, శతమానం భవతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా చిరంజీవి ‘ఖైదీ నెం.150’, బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి భారీ చిత్రాల మధ్య విడుదలై కూడా ‘శతమానం భవతి’ భారీ విజయం సాధించడం విశేషం.
మళ్లీ ఈసారి కూడా సంక్రాంతికే వస్తుండటంతో, శర్వానంద్‌కు హ్యాట్రిక్ హిట్ పడుతుందా అనే ఆసక్తి నెలకొంది. ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. సునీల్, నరేష్ విజయకృష్ణ, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.


