సమీక్ష : 2 కంట్రీస్ – కొంతైనా కంటెంట్ ఉంటే బాగుండేది

సమీక్ష : 2 కంట్రీస్ – కొంతైనా కంటెంట్ ఉంటే బాగుండేది

Published on Dec 30, 2017 11:00 AM IST
2 Countries movie review

విడుదల తేదీ : డిసెంబర్ 29, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : సునీల్, మనీషా రాజ్

దర్శకత్వం : ఎన్.శంకర్

నిర్మాత : ఎన్.శంకర్

సంగీతం : గోపీ సుందర్

సినిమాటోగ్రఫర్ : సి. రాంప్రసాద్

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర్రావు

సునీల్ హీరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలోరూపొందిన ‘2 కంట్రీస్’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించిందా ? లేదా ? చూద్దాం

కథ:
ఉల్లాస్ (సునీల్) వెంకటాపురంలో సరదాగా జీవితాన్ని గడిపే కుర్రాడు. డబ్బుకోసం సిమ్రన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అనుకోకుండా లయ (మనీష రాజ్ ) తో అతని వివాహం జరుగుతోంది. ఆ తరువాత ఉల్లాస్,లయకు మద్య విభేదాలు వచ్చి వ్యవహారం విడాకులు వరకు వెళుతుంది. తరువాత తన తప్పు తెలుసుకొని లయతో కలిసి బ్రతుకుదాం అనుకుంటాడు. చివరికి వీరిద్దరూ కలిసారా ? సిమ్రాన్ అనే అమ్మాయి ఉల్లాస్ జీవితంలోకి ఎలా వచ్చింది ? ఉల్లాస్, లయ మద్యల మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి ? తెలుసుకోవాలంటే 2 కంట్రీస్ చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమా మేకింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అమెరికాలో చిత్రీకరించిన సన్నివేశాలు రిచ్ గా ఉన్నాయి. సునీల్ కామెడి టైమింగ్ బాగుంది. శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి హీరోతో సమానమైన పాత్రల్లో నటించి మెప్పించారు.

కొత్త అమ్మాయి మనీష రాజ్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మొదటి సినిమానే అయినా ఆమె తన నటనతో ఆకట్టుకుంది. కమెడియన్ శివారెడ్డి చేసింది చిన్న పాత్రే అయినా బాగా చేసాడు. విలన్ క్యారెక్టర్ లో దేవ్ గిల్ నటన సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :

మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తియ్యడంలో దర్శకుడు ఎన్.శంకర్ విఫలమయ్యార ని చెప్పాలి. కథ పరువాలేదు అనిపించినా కథనం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. చాలా మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ హాస్యం అంతంత మాత్రంగానే ఓనిది తప్ప ఎక్కడా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదు. పాత సన్నివేశాలు, పసలేని స్క్రీన్ ప్లే ఉండడంతో కాస్తంత చిరాకు కలిగింది.

సినిమా నిడివి చాలా ఎక్కువ ఉండడంతో ఆడియన్స్ సహనం కోల్పోతారు. సినియర్ యాక్టర్ నరేష్ చేసిన పాత్ర అస్సలు ఆకట్టుకోదు సరికదా అసహజంగా తోచింది. తెలుగుని ఖూని చేస్తూ అతను మాట్లాడిన డైలాగ్స్ విసుగు తెప్పిస్తాయి. ఝాన్సీ క్యారెక్టర్ అస్సలు పండలేదు. ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి అస్సలు సంభంధం ఉండదు. కొన్ని పాత్రలు ఎందుకు వస్తున్నాయో ఎందుకు వెళ్తున్నాయో అర్ధం కాకపోవడం సినిమాకు ప్రధాన బలహీనత.

కథ కీలకమైన మలుపు తిరిగి హీరోయిన్ పాత్ర ఏమిటో పూర్తిగా తెలిసిపోయాక కూడా ఆమె పాత్రను సిల్లీగా చూపించడంతో సినిమాపై ఆసక్తి నీరుగారిపోయింది. అతిగా ఉండే కామెడీని చూస్తేగతంలో చెప్పుకోదగిన సినిమాలు తీసిన శంకరేనా దీనికి డైరెక్టర్ అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

ఎన్.శంకర్ మంచి కథను ఎంచుకున్నా దాన్ని తెరమీద ఆవిష్కరించడంలో సక్సెస్ కాలేకపోయారు. గోపి సుందర్ అందించిన పాటలు పెద్దగా లేనప్పటికి నేపధ్య సంగీతం బాగుంది. కెమెరా మెన్ సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. అమెరికాలో లొకేషన్స్ బాగా చూపించడం జరిగింది.

ఈ మూవీలో డైలాగ్స్ రాసిన శ్రీధర్ సీపాన పంచులు, ప్రాసలతో సినిమాను నింపేశారు. దీంతో అర్ధం పర్ధం లేని డైలాగ్స్ ఎక్కువై అంతంతమాత్రంగానే ఉండే కథనం ఇంకాస్త దెబ్బతింది. సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉంది. సెకండ్ హాఫ్ అంత అవసరం లేదు. చాలా సన్నివేశాలను ఎడిటింగ్ లో తొలగించాల్సింది.

తీర్పు :

సునీల్ తనకు తగట్టు కథలను ఎంచుకోవడంలో ఈసారి కూడా విఫలమయ్యాడు. అసలు అయాన్ ఏ అంశాలు చూసి ఈ చిత్రాన్ని ఓకే చేశారు అనిపిస్తుంది. కథను తక్కువ సమయంలో మంచి సన్నివేశాలతో, హెల్తీ కామెడి సీన్స్ తో తెరకెక్కించి ఉంటే సినిమా బాగుండేది. కానీ ఇక్కడ అలా జరగలేదు. షియాజీ షిండే, శ్రీనివాస్ రెడ్డి, రాజా రవీందర్ వంటి మంచి నటులు ఉన్నా వారికి సరైన పాత్రలు, సన్నివేశాలు ఇవ్వకపోవడంతో సినిమా పక్కదారి పట్టింది. కథ చెప్పే విధానంలో కూడా క్లారిటీ లేదు. మొత్తం మీద ఏమాత్రం ఎంజాయ్ చేయదగిన కంటెంట్ లేని ఈ చిత్రం సునీల్ కామెడీని ఆశించే వారికి కొద్దిగా నచ్చవచ్చు తప్ప మిగతా ప్రేక్షకులకు అస్సలు నచ్చదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు